ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవు,
• నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలి
• చెక్ పోస్ట్ లలో వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా జరగాలి
• మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ (న్యూస్ విధాత్రి ప్రతినిధి), నవంబర్ 8: సాధారణ ఎన్నికల నియమావళి లో భాగంగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా లో అన్ని శాఖల నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయంతో తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తో కలిసి ఎన్నికల వ్యయ, ఎక్సైజ్, జీఎస్టీ, ఎంసిసి, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ శాసనసభ సాధారణ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై ఆయా నోడల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అన్నారు. ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువులను సీజ్ చేసే సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని, పట్టుబడిన వాటిని ఎన్నికల నియామావళి మేరకు సీజ్ చేయాలని, ఎన్నికల సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా పట్టుబడిన వాటిపై బృందాల ద్వారా సమక్షించుకుని త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు అనవసర ఇబ్బందులు ఏర్పడకుండా సంయమనంతో వ్యవహరించాలని, నగదును జప్తు చేసిన సందర్భాలలో తగు రీతిలో విచారణ నిర్వహించి తప్పనిసరిగా రశీదులు అందించాలని ఆదేశించారు. అంతేకాకుండా తగిన ఆధారాలను చూపించి నగదును విడిపించుకునే వెసులుబాటు ఉంది అనే విషయాన్ని వివరించాలని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ గురించి తెలియజేయాలని సూచించారు.
నోడల్ అధికారులు ప్రతి రోజు నమోదు చేసే కేసుల వివరాలను పూర్తిగా తెలపాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు తమ రిపోర్ట్ లు ఒక నిర్ణిత మైన ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు. ఎన్నికల సమయంలో సీజ్ చేసే నగదు, బంగారం, మధ్యం, ఇతర విలువైన అభరణాల విషయము లో నోడల్ అధికారులు అందరూ మరింత సమన్వయ తో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాల్సిందిగా ఆకాంక్షించారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వాటిని పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు.
ఈ సమావేశము లో నోడల్ అధికారులు , డీసీవో శ్రీనివాస మూర్తి, డీటీవో నర్సింహ , ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అరుణ్ కుమార్, విజయ భాస్కర్, జీఎస్టీ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.