కుటుంబ కలహాలతో భార్యను హతమార్చిన భర్త
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ), మే 24 : భార్యను కుటుంబ కలహాల కారణంగా విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసిన కిరాతక భర్త వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు మేకల నాగేంద్ర భరద్వాజ్ (31)కు అదే జిల్లా కనకమెట్ల కు చెందిన మధులత (29) తో 2020 సంవత్సరంలో వివాహం జరిగింది. వారికి 17 నెలల బాలుడు ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ నగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బాచుపల్లి లోని సాయి అనురాగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడేవారు. 2022 డిసెంబర్ 20వ తారీఖున బిడ్డ పుట్టినప్పటికీ బిడ్డను చూడడానికి కూడా భరద్వాజ్ రాలేదని, అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ 2024 లో అత్తింటికి వెళ్లిన భరద్వాజ్ వారితో ఇకనుంచి తన భార్య బిడ్డను సరిగ్గా చూసుకుంటానని ఎటువంటి గొడవలు పడనని అత్తమామలను ఒప్పించి హైదరాబాద్ తీసుకువచ్చాడు. అనంతరం కొన్ని రోజులు బాగానే ఉన్నా మరల తరచూ గొడవలు పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 1:30 గంటలకు మధులత అక్క శ్రీవిద్య, సోదరుడు సాయి రంగనాథ్ కి మధులత అపార్ట్మెంట్ వాసులు ఫోన్ చేసి ఈనెల 4వ తేదీ రాత్రి సుమారు 9:30 గంటలకు మధులతను ఆమె భర్త నాగేంద్ర భరద్వాజ్ కత్తితో మెడపై, ఇతర శరీర భాగాలపై పొడిచి చంపి పరారయ్యాడని వారు తెలిపారు. భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా చేయడానికి భరద్వాజ్ ప్రయత్నించాడని, అనంతరం గ్యాస్ లీకేజీగా ప్రమాదాన్ని చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశాడనే విషయాలు తెలుస్తున్నాయి. కూతురు హత్య జరిగిన విషయాన్ని తెలుసుకొని మధులత ఇంటికి చేరుకున్న ఆమె తండ్రి నారాయణ శ్రీ రంగనాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగేంద్ర భరద్వాజ్ పై కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన బాచుపల్లి పోలీసులు శుక్రవారం భరద్వాజ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు .
గోప్యత అవసరమేముంది…?
ఘోర దారుణమైన సంఘటన జరిగి సుమారు 20 రోజులు కావస్తున్న పోలీసులు గోప్యంగా ఉంచడం పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓ మహిళను దారుణంగా హత్య చేసి పరారైన ఒక నిండుతుడి విషయాన్ని పోలీసులు ఇంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కనీసం మీడియాకు కూడా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టడం ఏమిటని పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. ఇదే విషయాన్ని విలేకరులు పోలీసులను ప్రశ్నించగా ‘అన్ని విషయాలు పోలీసులే చెబితే మీరు రాసేదేమున్నది… మీరు వార్త సేకరించుకోవాలి కదా…’ ‘ఎన్నికల హడావిడిలో ఉండి ఉంటాం’ అనే సమాధానాలు ఇవ్వడం గమనార్హం.