గణేష్ నగర్ ప్రధాన రహదారిలో రోడ్డు ప్రమాదం
~ పారిశుద్ధ్య కార్మికుని ఢీకొట్టిన ఉబర్ క్యాబ్
~ పైకి ఎగిరి విద్యుత్ స్తంభాన్ని గుద్దుకొని కిందపడిపోయిన కార్మికుడు
~ రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు… పోలీసుల అదుపులో డ్రైవర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 28 : మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా కారు నడిపి రహదారి పక్కన విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుని ఢీ కొట్టి తీవ్రంగా గాయపరిచిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… గాజులరామారం సర్కిల్ పారిశుద్ధ్య విభాగంలో కార్మికుడిగా శాంతారావు (39) పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా రోజువారీగానే గణేష్ నగర్ ప్రధాన రహదారి పక్కన ఓ ద్విచక్ర వాహన షోరూమ్ ఎదురుగా చెత్త సేకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఐడిపిఎల్ నుంచి చింతల్ వైపుకు ఉబర్ క్యాబ్ (టీఎస్07యుఎం0507) లో అజాగ్రత్తగా మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు డ్రైవర్ బి. నాగాంజనేయ శాంతారావును బలంగా ఢీకొట్టాడు. దీంతో కార్మికుడు ఎగిరి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని గుద్దుకొని కింద పడిపోయాడు.
దీంతో స్థానికులు తీవ్రంగా గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికుడి రెండు కాళ్లు తీవ్రంగా గాయపడ్డాయని, ప్రస్తుతం ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
.