గదిలో ఊరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య
~ గత రెండు రోజుల క్రితమే జరిగి ఉంటుందని సందేహం
~ గది నుండి తీవ్ర దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 5 : ఓ వ్యక్తి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జీడిమెట్ల పిఎస్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి చెరుకుపల్లి కాలనీ రోడ్ నెంబర్ 2లో ఓ ఇంట్లో వీరారెడ్డి (సుమారు 35 సంవత్సరాలు) అనే వ్యక్తి తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఐస్ క్రీమ్ విక్రయిస్తూ జీవనం గడుపుతుంటాడని స్థానికులు తెలిపారు. అయితే సంఘటన స్థలం ఆధారంగా గత రెండు రోజుల ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తెలుస్తుంది. గది నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుండడంతో స్థానికులు ఇంటి యజమాని బాలకృష్ణకు ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం గది వద్దకు వచ్చి చూసేసరికి గుమ్మం వద్ద రక్తం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు గది తలుపును పగలగొట్టి చూడగా వీరారెడ్డి ఉరివేసుకొని కనిపించాడు. సదరు గదిని శ్రీకాకుళం కు చెందిన శివ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చానని, అతనితో పాటు వీరారెడ్డి గదిలో ఉంటున్నాడని ఇంటి యజమాని బాలకృష్ణ తెలిపాడు. గత వారం రోజుల క్రితమే శివ ఊరికి వెళ్ళినట్టు తెలుస్తుంది. బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.