ఘనంగా డిజిటల్ సాటిలైట్ స్కూల్ అవార్డులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 14: డిజిటల్ స్టూడెంట్స్ సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ సాటిలైట్ పాఠశాల అవార్డులను నగరంలోని షాపూర్ నగర్ లో ఉన్న శుభం హోటల్లో ప్రధానం చేశారు. ఆల్ ఇండియా ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్, ట్రస్మా (తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్) తో కలిసి తెలంగాణ రాష్ట్ర పాఠశాల ప్రిన్సిపల్, కరెస్పాండెంట్స్ కి 2024 వ సంవత్సరానికి గాను ఉత్తమ ఎడ్యుకేటర్ అవార్డులను అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా పాఠశాల అసోసియేషన్ డైరెక్టర్ షిజూ అగస్తిన్, ప్రధాన సలహాదారులు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాత్రి యాదగిరి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధి కోసం సెమినార్ నిర్వహించి, బడ్జెట్ పాఠశాలలు విద్యాబోధనలో ఆధునిక సాంకేతికతను జోడించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ముందుకు సాగాలని సూచించారు. బడ్జెట్ పాఠశాలల సమస్యలపై ప్రతి ఒక్కరు సమన్వయంతో ఏకతాటిపై పోరాటం చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉన్న ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లను, ప్రిన్సిపల్ లను ఒకే వేదికపై సత్కరించుకోవడం ఆనందంగా ఉందని, కార్యక్రమాన్ని నిర్వహించిన డిజిటల్ స్టూడెంట్స్ సంస్థను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు కృషి చేస్తానని శివరాత్రి యాదగిరి అన్నారు. తెలంగాణ ఉపాధ్యాయులను సత్కరించుకోవడం తమ సంస్థ చేసుకున్న అదృష్టమని, ఇలాంటి కార్యక్రమాలను తమ సంస్థ తరుపున ప్రతి సంవత్సరం నిర్వహించేందుకు కృషి చేస్తామని డిజిటల్ స్టూడెంట్స్ సంస్థ ఎండి డాక్టర్ సోమశేఖర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ లోని ప్రతి జిల్లా నుంచి 5 మంది ఉత్తమ ఎడ్యుకేటర్లను ఎంపిక చేయడంతో పాటు సుమారు 375 మందికి అవార్డులను ప్రధానం చేశారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవార్డులను ప్రధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల ట్రస్మా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు.