చిత్తారమ్మ దేవి జాతరలో అడుగడుగునా నిఘా
• ప్రత్యేక సీసీ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షించిన జీడిమెట్ల పోలీసులు
• ప్రశాంతంగా ముగిసిన జాతర
• సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 19: గాజులరామారం శ్రీ చిత్తారమ్మ దేవి జాతర స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జీడిమెట్ల పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. జాతరలో అడుగడుగున నిఘా ఉండేటట్లు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి బందోబస్తును పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి బాలానగర్ ఏసిపి హనుమంతరావు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. చిత్తరమ్మ దేవి జాతర స్వర్ణోత్సవ వేడుకల బందోబస్తు కోసం 300 మంది పోలీసు సిబ్బంది, వివిధ ర్యాంక్ అధికారులతో పాటు 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు. డ్రోన్లతో పర్యవేక్షిస్తూ 100 మంది వాలంటీర్ల సేవను ప్రత్యేకంగా ఈ సంవత్సర జాతరలో వినియోగించామన్నారు. అలాగే అత్యవసర సమయంలో అందుబాటులో ఉండే విధంగా అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసు శాఖ తరపున తాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించామని తెలిపారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జాతర ప్రశాంతంగా ముగిసేందుకు సమన్వయంతో సహకరించిన పోలీసు సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు.