చిరుత పులి కాదు… అడవి పిల్లి…
~ గాజులరామారం కైసర్ నగర్ లో కలకలం సృష్టించిన అడవి పిల్లి
~ వెంబడించి బంధించిన స్థానిక యువత
~ 15 రోజుల క్రితం తప్పిపోయిన అడవి పిల్లి
~ రాకేష్ అనే వ్యక్తి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు
~ బుధవారం దొరకడంతో రాకేష్ కు అందజేసిన అధికారులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 29 : అడవి పిల్లిని చూసి చిరుత పులి పిల్ల అనుకొని స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన కుత్బుల్లాపూర్ లోని గాజులరామారం సర్కిల్ పరిధి కైసర్ నగర్ లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలో చోటు చేసుకుంది. డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నీటి సంపులో అడవి పిల్లి (జంగల్ క్యాట్ ) బుధవారం ఉదయం ప్రత్యక్షమై కలకలం సృష్టించింది. చిరుత పులి పిల్లగా భావించిన స్థానిక యువత అప్రమత్తమై దాన్ని వెంబడించి పట్టుకుని బంధించి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. దానిని బంధించిన అనంతరం స్థానికులు సెల్ఫీలకు ఫోజు ఇచ్చారు.
చిరుతను పోలిన అడవి పిల్లి… బెదిరిన స్థానికులు…
చిరుత పులిని పోలిన అడవి పిల్లిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారని, వాస్తవానికి అది చిరుత పులి కాదని అడవి పిల్లి అని ఫారెస్ట్ రేంజ్ అధికారి (ఎఫ్ ఆర్ ఓ) లక్ష్మణ్ తెలిపారు. భౌరంపేట్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి గత 15 రోజుల క్రితమే తన ఫామ్ నుంచి అడవి పిల్లి తప్పిపోయిందని ఫిర్యాదు చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పటినుండి తాము కూడా తప్పిపోయిన అడవి పిల్లి కోసం వెతుకుతున్నామన్నారు. బుధవారం అడవి పిల్లి దొరకడంతో దానిని రాకేష్ కు తిరిగి అప్పగించామని లక్ష్మణ్ తెలిపారు.