జర్నలిస్టు ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు స్వీకరణ
– అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి. – గడ్డమీద బాలరాజ్, కోటగడ్డ శ్రీనివాస్
గాజులరామారం (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 25 : అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టియుడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు గడ్డమీది బాలరాజ్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనం లో బుధవారం నియోజకవర్గ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్ద కాలంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ అంశంపై పోరాడుతున్నామని, ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను అర్థం చేసుకొని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. ఇందుకు నియోజకవర్గాల వారీగా ఇళ్ల స్థలాల దరఖాస్తులను జర్నలిస్టుల నుంచి స్వీకరిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిజం లో ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోటానికి అర్హులని, ప్రమాణ పత్రాలుగా అక్రిడేషన్ లేదా ఆయా పత్రికల ఎం పానెల్ పత్రాన్ని జతచేయాలని సూచించారు. ఈనెల 29 ఆదివారం వరకు పూర్తి చేసిన దరఖాస్తులను సూరారం లో ఉన్న కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ భవనంలో అందజేయాలని పేర్కొన్నారు.
• పలు తీర్మానాలకు ఆమోదం…
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో భాగంగా పలు తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రెస్ క్లబ్ బాధ్యులపై గానీ, జర్నలిస్టులపై గానీ వ్యక్తిగత విమర్శలకు దిగడం, ప్రెస్ క్లబ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, అవసరమైతే వారి యూనియన్ సభ్యత్వం తొలగిస్తామని హెచ్చరించారు. ప్రెస్ క్లబ్ నిర్వహణ పై ఎవరికైనా ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉంటే వాటిని నేరుగా అధ్యక్షులు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఇష్టానుసారంగా సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని విమర్శలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని సభ్యులు తీర్మానించారు. కార్యక్రమంలో జిల్లా సహ కార్యదర్శి వెంకట్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గుంటూరు శేఖర్, కార్యదర్శులు దయాకర్ రెడ్డి, నాగేంద్ర చారి, నియోజకవర్గ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, ఉపాధ్యక్షులు కలికి మూర్తి, మహేందర్ రెడ్డి, అదనపు కార్యదర్శులు దత్తు గుంటుపల్లి, ఎల్లంపల్లి నరసింహులు , సభ్యులు పరమేష్ రెడ్డి, నాగబాబు, నర్సింగ్, గణేష్, శ్రీను, గ్రంథాలు, సురేష్, రాజేందర్, మద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.