జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నాం
~ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
√ ఇప్పటివరకు మొత్తం రూ. 43, 62, 23, 331 సీజ్
√ అందులో రూ. 18, 95,31,161 నగదు
√ రూ. 24,66,92,170 విలువ గల ఆభరణాలు
√ 1,24,098 లీటర్ల మద్యం స్వాధీనం
√ ఎక్సైజ్ శాఖకు సంబంధించి 645 కేసులు… 321 అరెస్టు
మేడ్చల్ (న్యూస్ విధాత్రి ప్రతినిధి), నవంబర్ 6: కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన వ్యయ నియంత్రణ బృందం నేతృత్వం వహిస్తున్న డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఎస్ హెచ్ అజయ్ బదూ , రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ లోని రాష్ట్ర ఎన్నికల కమీషన్ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
ఈ వీసీలో జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఎన్నికల అధికారులు శ్రీనివాస మూర్తి, నర్సింహ, కృష్ణారెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనలు పాటిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి పకడ్భందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వీడియో సమావేశంలో తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికల నిఘా బృందాలు, పోలీసులు మొత్తం రూ. 43, 62, 23, 331 నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. అందులో రూ. 18, 95,31,161 నగదును, రూ. 24,66,92,170 విలువ గల ఆభరణాలు, 1,24,098 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొన్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఎక్సైజ్ శాఖకు సంబంధించి 645 కేసులు నమోదయ్యాయని, 321 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసుల్లో జిల్లా గ్రీవెన్స్ కమిటీ అధికారులు అన్ని రకాల ధ్రువపత్రాలు పరిశీలించి అన్ని రకాల ఆధారాలు సరిగ్గా ఉన్న కేసులకు సంబంధించి రూ.13,18,81,448 నగదుకు గాను రూ. 8,69, 30, 114 అప్పగించినట్లు, సరైన ఆధారాలు లేని రూ.4.25 కోట్లు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో పాటు గ్రీవెన్స్ కమిటీకి సంబంధించి వచ్చిన కేసులను పరిశీలించి సరైన ఆధారాలు ఉంటే వాటిని విడుదల చేసినట్లు తెలిపారు.
అలాగే ఆయా కేసులలో ఇన్కం ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జీఎస్టీ వారికి సమాచారం అందించి కేసులకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్, సర్వేలెన్స్, తదితర బృందాలతో ఇప్పటికే మూడుసార్లు ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిచామని జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లాలో తనిఖీల సమయంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు తదితరాలు లభించినట్లయితే ఇన్కం ట్యాక్స్ వారికి పంపిస్తున్నామని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా, పకడ్భందీగా అమలు చేస్తున్నామని ఈ విషయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు, సిబ్బంది ఎంతో బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు తెలిపారు.