జీవీపీ రహిత సర్కిల్ గా తీర్చిదిద్దాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 23: పరిసర ప్రాంతాలతో పాటు సర్కిల్ ను పరిశుభ్రంగా ఉంచి గార్బేజ్ వలనరబుల్ పాయింట్ (జీవీపీ) రహిత సర్కిల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ వి. నరసింహ అన్నారు. సర్కిల్ పరిధిలోని శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్ఎఫ్ఏలు), రిసోర్స్ పర్సన్లు (ఆర్పీలు) లతో సర్కిల్ కార్యాలయంలో డిసి, ఏఎంఓహచ్ డా. భార్గవ్ నారాయణ, డిపిఓ హిమబిందు లతో కలిసి గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఎస్ఎఫ్ఏలు, ఆర్పీలు, ఎస్ హెచ్ జి సభ్యులు ఇంటింటికి తిరుగుతూ స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ఇంటి వద్దకు వచ్చే స్వచ్ఛ ఆటోల వారికి చెత్తను అందించేలా చైతన్య పరచాలని సూచించారు.
సర్కిల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, నాలాలు, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించాలని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛ ఆటోల వారు కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి కేటాయించిన ప్రాంతాల్లో చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని డిసి తెలిపారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ ఆర్గనైజర్లు బాలరాజు, జగదీష్, కవిత, వెంకటరెడ్డి, కిషోర్ పాల్గొన్నారు