జోరు వర్షంలోనూ… జోరుగా నిరసన
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 16 : దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐఏఆర్ఈ కళాశాల ముందు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విద్యార్థి సంఘాల నిరసన కొనసాగుతుంది. కళాశాల యాజమాన్యం కానీ, ప్రిన్సిపాల్ కానీ స్పందించకపోవడంతో నిరసన గళాన్ని ఉదృతం చేశారు. కళాశాల గేట్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో విద్యార్థి సంఘాల సభ్యులకు, కళాశాల సిబ్బంది, బౌన్సర్లకు మధ్య తోపులాట తీవ్రతరం అయ్యింది. దీంతో కళాశాల ప్రధాన రహదారిపై ఉన్న ఒక గేటు విరిగిపోయింది.
అనంతరం మధ్యాహ్నం మంచి ప్రారంభమైన జోరు వానను సైతం లెక్కచేయకుండా విద్యార్థి సంఘాల నాయకులు వర్షంలో తడుస్తూనే రోడ్డుపై బైఠాయించి రెట్టింపు ఉత్సాహంతో జోరుగా నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం చేయాలని, కళాశాల యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని నినాదాలు చేశారు.