ఠాణాలా…? సెటిల్ మెంట్ అడ్డాలా…?
• పోలీస్ స్టేషన్ లోనే బాధితులు, బాధ్యులు బేరసారాలు
• అన్నీ తెలిసినా మిన్నకుంటున్న పోలీసులు
• పిఎస్ లో పోలీసుల ముందే గొడవలకు దిగుతున్న వైనం
• దుండిగల్ పిఎస్ లో చోటు చేసుకున్న ఓ ఘటనే నిదర్శనం
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 27: పోలీసు ఠాణాలు సెటిల్ మెంట్ల అడ్డాలుగా మారుతున్నాయి. ఏదైనా సంఘటన, నేరం వల్ల నష్టం వాటిల్లినప్పుడో, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడో న్యాయం కోసం బాధితులు పోలీసు స్టేషన్, పోలీసులను ఆశ్రయిస్తారు. ఆటువంటి పోలీసు స్టేషన్లో ఇప్పుడు నష్టం కలిగిన బాధితులకు, బాధ్యులకు మధ్య సెటిల్ మెంట్ అడ్డాలుగా, పోలీసులే వారికి వారధులుగా మారుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.. నేరాలపై పోలీసు స్టేషన్ లో కేసులు నమోదై, ఎస్ఐఆర్ లు బుక్కైనప్పటికి వాటిని నిర్వీర్యం చేసేలా పిఎస్ లోనే సెటిల్ మెంట్లు జరుగుతున్నాయనే వాదన బలంగానే వినిపిస్తుంది. దీనిని నిజం చేస్తూ దుండిగల్ పోలీసు స్టేషన్లో ఓ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.
• పరిశ్రమలో కార్మికుడి మృతిపై బేరసారాలు…
దుండిగల్ పీఎస్ పరిధిలోని ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ పరిశ్రమలో కర్ణాటక రాష్ట్రం బీదరు చెందిన రమేష్ (55) వని చేస్తూ ఆదివారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడి మెడపై కాలిన గాయం ఉండడం వల్ల విద్యుత్తుదాఘాతం జరిగి ఉంటుందా..? లేక మరేదైనా జరిగి ఉంటుదా..? అనే అనుమానాలును వ్యక్తం చేస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా…మృతుడికి నష్ట పరిహారం కోసం ఇటు కుటుంబ సభ్యులు, ఆటు బంధువులతో పాటు పలువురు పరిశ్రమ నిర్వహకుడితో చర్చలు ప్రారంభించారు. ఆ చర్చలు కాస్త పోలీసు స్టేషన్ వరకు సోమవారం చేరుకున్నాయి. దీంతో పోలీసు స్టేషన్ కు మృతుడి తరపున సుమారు 30 మంది వచ్చి పరిశ్రమ నిర్వహకుడితో నష్ట పరిహారం కోసం బేరసారాలు కొనసాగిస్తూ ఠాణాను సెటిల్ మెంట్ అడ్డాగా మార్చేశారు. ఠాణా ఆవరణంలోనే పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది సాక్షిగా బహిరంగంగా లక్ష, రెండు లక్షల రూపాయలు అంటూ సెటిల్మెంట్ కు పాల్పడ్డారు. ఇంత తంతు అక్కడ జరుగుతున్నా పోలీసులు వారిని వారించకపోవడం విశేషం. ఈ క్రమంలో మృతుడి పెద్ద కొడుకు, మరి కొందరికి రాణా ఆవరణంలోనే వాగ్వాదం చోటు చేసుకొని పోలీసులు ఉన్నారన్న భయం కానీ, గౌరవం కానీ లేకుండా ఒకరినొకరు నెట్టుకోవడం వరకు వచ్చింది.
దీంతో పోలీసులు సిబ్బంది కల్పించుకొని వారిని స్టేషన్ బయటకు పంపి వేయడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసు స్టేషన్ లో సెటిల్ మెంట్ ఏంటని, ఏమైనా ఉంటే స్టేషన్ బయట చూసుకోవాలని అక్కడి వారు గుసగుసలాడుకున్నారు.