తల్లిని కడతేర్చిన కసాయి తనయుడు
• గంజాయి మత్తులో పెంపుడు తల్లిని కడతేర్చిన కిరాతకుడు
• మగ సంతానం కావాలనుకుంటే… కాలయముడయ్యాడు
• కుత్బుల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న సంఘటన
• పోలీసుల అదుపులో నిందితుడు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 22 : ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన అనంతరం మగ సంతానం కోసం చేరదీసి పెంచుకుంటున్న ఆ పెంపుడు కొడుకే ఆ తల్లి పాలిట కాలయముడుగా మారాడు. గంజాయికి బానిసై ఆ మత్తులో డబ్బుల కోసం పెంపుడు తల్లిని కడతేర్చిన ఓ కిరాతక కొడుకు సంఘటన కుత్బుల్లాపూర్ గ్రామం హరిజన బస్తీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి జలమండలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న పెద్ది స్వామి, భార్య పెద్ది జయమ్మ (64) దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. మగ సంతానం కావాలని బంధువుల నుంచి 3 నెలల వేణు (నిందితుడు) అనే ఓ మగ పిల్లవాడిని తెచ్చుకొని సుమారు 32 సంవత్సరాలు పెంచి పోషించి వివాహం కూడా చేశారు. వేణుని తెచ్చుకొని పెంచుకుంటున్న సుమారు నాలుగు సంవత్సరాల అనంతరం స్వామీ, జయమ్మలకు వినోద్ (24) జన్మించాడు.
• గంజాయికి బానిసై డబ్బు కోసం…
నిందితుడు వేణు (32) పని పాట లేక జులాయిగా తిరుగుతూ గంజాయికి బానిసై నిత్యం తల్లిదండ్రులు, భార్యతో గొడవపడేవాడు. అతని ప్రవర్తన భరించలేక ఇటీవల సుమారు 8 నెలల క్రితం అతని భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా తీరు మార్చుకొని వేణు నిత్యం తాగి వచ్చి డబ్బుల కోసం తల్లిదండ్రులకు గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన సెల్ ఫోన్ ను తాకట్టుపెట్టి గంజాయి సేవించి ఇంటికి వచ్చి అదనపు డబ్బు కోసం తల్లిని వేధించాడు. ఈ క్రమంలో తల్లి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తుంది. దీంతో గంజాయి మత్తులో తల్లిని విచక్షణారహితంగా కొట్టి, నుదుటిపై పదునైన పరికరంతో సుమారు రెండు అంగుళాలు లోపలికి పొడిచి కడ తేర్చినట్లు తెలుస్తుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
• అదృశ్యమైన సొంత కొడుకు వినోద్…
స్వామి, జయమ్మల సొంత కొడుకు సుమారు 18 నెలల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే ప్రస్తుతం చోటుచేసుకున్న సంఘటనతో వినోద్ ను కూడా వేణు ఏదైనా చేసి ఉంటాడా…? అనే అనుమానాలను కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.