దుండిగల్ తాండా-2లో ఒంటరి మహిళ అనుమానాస్పద మృతి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 23: ఒంటరి మహిళ హత్యకు గురైన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం…దుండిగల్ తాండ-2 లో జరుపుల శాంతి (50) అనే ఒంటరి మహిళకు అక్కడే కొంత పొలం,పశువులు ఉన్నాయి. పశువుల పాలు అమ్మడంతో పాటు ఒక చిన్న డబ్బాలో (దుకాణంలో) కల్లు, మద్యం విక్రయిస్తూ బెల్ట్ షాపును నిర్వహిస్తూ జీవనం సాగిస్తుంది. ఆమెకు కూతురు, అల్లుడు ఉన్నారు. శుక్రవారం ఉదయం అనుమానాస్పదంగా ఒంటినిండా గాయాలతో ఆమె దుకాణం పక్కన విగతజీవిగా పడి ఉంది. దీనిని గమనించిన స్థానికులు అక్కడే నివాసం ఉండే ఆమె కూతురు, దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. ఆమె కల్లు, మద్యం సేవిస్తుందని ఆ మత్తులో పక్కనే ఉన్న రాళ్లపై పడి చనిపోయిందా…? లేక ఎవరైనా ఆమెను హత్య చేశారా…? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆయా కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.