నగర మేయర్ ఆకస్మిక తనిఖీలు… సీజ్ చేసిన తినుబండారాల తయారీ కేంద్రాలు
• ఫిర్యాదులు అందడంతో తనిఖీలు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), జనవరి 22: అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా, నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి నాణ్యత ప్రమాణాలను పాటించకుండా నిర్వహిస్తున్న తినుబండారాల తయారీ కేంద్రాలను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, వాటిని బుధవారం సీజ్ చేయించారు.

పలు సామాజిక మాధ్యమాలతో పాటు పలు రకాలుగా అందిన ఫిర్యాదుల మేరకు గాజులరామారం సర్కిల్ పరిధి సూరారం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న చెకోడీ, మిక్సర్ తయారీతో పాటు బాద్షా తయారీ కేంద్రాలను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. తినుబండారాలు తయారు చేసే విధానాన్ని ఆమె పరిశీలించి ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తుండడంతో మేయర్ నిర్వాహకులను నిడదీశారు. అంతేకాకుండా ఆహార భద్రతతో తయారీ కేంద్రాలకు సంబంధించిన ఎటువంటి అనుమతులను పొందకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి తినుబండారాల తయారీ కేంద్రాల వల్లనే ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు అనారోగ్యాల బారినపడి ఆస్పత్రిలో పాలవుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బాద్షా తయారీ కేంద్రాన్ని వెంటనే సీజ్ చేయించారు. అలాగే మిక్చర్, చెకోడి తయారీ కేంద్రాలను అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. జంట సర్కిళ్ల పరిధుల్లో ఉన్న అన్ని తినుబండారాల తయారీ కేంద్రాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత ప్రమాణాలు పాటించని వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ తనిఖీలలో అదనపు కమిషనర్ (హెల్త్) పంకజ, జంట సర్కిళ్ల ఉప కమిషనర్లు ఎల్. పి. మల్లారెడ్డి, వి. నరసింహ, ఏ ఎం వో హెచ్ లు మమత, కవిత, ఆహార భద్రత ఇన్స్పెక్టర్ పవన్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.