నడిరోడ్డుపై జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ ఓవర్ యాక్షన్
ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ల పై ప్రతాపం
కాలితో తన్ని.. చెంప చెల్లుమనిపించిన వైనం
ఐడిపిఎల్ కూడలి వద్ద ఘటన
వీడియో వైరల్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 4: సీఐ హోదాలో బాధ్యతగల పోలీసు అధికారి స్థానంలో ఉండి నడిరోడ్డుపై ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పై రౌడీయిజం చేయడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకట్ రెడ్డి చేసిన ఈ దుష్చర్యపై దుమారం రేగుతోంది. బస్సు డ్రైవర్ ను కాలితో తన్ని, చెంప చెల్లుమనిపించి తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. శనివారం రాత్రి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు డ్రైవర్ నిబంధనలను అతిక్రమించి షాపూర్ నగర్ లో రాష్ డ్రైవింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు బస్సును ఆపే ప్రయత్నం చేశారు. డ్రైవర్ బస్సు ఆపకపోవడంతో వెంబడించి ఐడిపిఎల్ కూడలిలో బస్సును ఆపారు. అక్కడకు చేరుకున్న సిఐ వెంకట్ రెడ్డి డ్రైవర్ ను బస్సులోంచి కిందకు దింపి కాలుతో తన్ని, చెంప చెల్లుమనిపించడం వివాదంగా మారింది. డ్రైవరు నిబంధన లు అతిక్రమించి ఆపకుండా వెళ్లాడని, ఐడిపిఎల్ కూడలి వద్ద ఆపి ప్రశ్నిస్తే వాగ్వాదానికి దిగడంతో పాటు సిబ్బందిపై దాడికి యత్నించాడని, అందుకే అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, సీఐ వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. డ్రైవర్ తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి . కానీ.. కొట్టే అధికారం పోలీసులకు ఎవరు ఇచ్చారంటూ అక్కడి ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం విశేషం.
దుశ్చర్యను కప్పి పుచ్చుకునేందుకు ట్విట్టర్ లో కవరింగ్…
బస్సు డ్రైవర్ పై చేసిన రౌడీయిజం వీడియోలు వైరల్ అవడంతో జీడిమెట్ల సిఐ పవన్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. బస్సు డ్రైవర్ రాష్ డ్రైవింగ్ చేస్తూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశాడని, ఆ బస్సును నియంత్రించాలంటూ ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. దీంతో సిబ్బంది బస్సును ఐడిపిఎల్ లో ఆపగా బస్సు డ్రైవర్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కానీ… వాస్తవానికి వైరల్ అయిన వీడియోలు పరిశీలిస్తే బస్సు డ్రైవర్ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఏ కోణంలోనూ కనిపించడం లేదని, డ్రైవర్ ను క్యాబిన్ నుంచి కిందికి దింపి మాట్లాడుతూ మాట్లాడుతూ… పోలీసులే దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తుందని పలువురు పోలీసులు తీరును తప్పుపడుతున్నారు. వారు చేసిన దుశ్చర్యను కప్పిపుచ్చుకునేందుకే ‘సిబ్బందిపై దాడికి యత్నం… రాష్ డ్రైవింగ్.. ‘ అంటూ కథలు చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.