నాడు అంగీకారం… నేడు తెలియదనడమా….?
~ అన్నీ తెలిసి కూడా తెలియదంటున్న మేడ్చల్ విద్యుత్ డి ఈ
~ అప్పుడు భరోసా ఇచ్చారు ఇప్పుడు బాధ పెడుతున్నారని బాధితుడి ఆవేదన
~ కార్మికుడి చికిత్స ఖర్చులు, నష్టపరిహారం విషయంలో డిఈ శ్రీనాథ్ రెడ్డి తీరు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 25: ఓ సంఘటన విషయంలో చికిత్స నిమిత్తం ఎంత ఖర్చు అయినా అందరం కలిసి భరిద్దాం.. నువ్వేమీ ఖర్చు కోసం అలోచించకు.. నీ వెనుకాల మేము ఉన్నామని ఓ ఆర్టిజన్ కు నాడు భరోసా ఇచ్చిన విద్యుత్ ఉన్నతాధికారి… మాకు ఆ విషయమే తెలియదు, మా దృష్టికే రాలేదు, మా రికార్డుల్లో అటువంటిది ఏమీ లేదు అంటూ నేడు యూటర్న్ తీసుకోవడం బాధితుడిని విస్మయానికి గురి చేస్తుంది. అప్పుడు అందరి సమక్షంలో న్యాయం చేస్తానని చెప్పి ఇప్పుడు నాకేం సంబంధం లేదనడం బాధితుడిని బాధిస్తుంది. ఇదంతా శుక్రవారం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైన మేడ్చల్ విద్యుత్తు డీఈ శ్రీనాథ్ రెడ్డి తీరు.
ప్రమాదానికి గురైన కార్మికుడిని ఆస్పత్రిలో చూసి వచ్చి కూడా…
షామీర్పేట్ విద్యుత్ విభాగంలోని మూడుచింతలపల్లి పరిధిలో 2022 మే నెలలో విద్యుత్తు మరమ్మతుల నిమిత్తం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టిజన్ బైండ్ల నర్సింహులు బయట నుంచి శేఖర్ అనే విద్యుత్ కార్మికుడిని తీసువచ్చి పనులు చేయిస్తున్నాడు. సదరు కార్మికుడు స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతాని గురై తీవ్ర గాయాలతో కాళ్లు, చేతులు కోల్పోవల్సి వచ్చింది. దీంతో విద్యుత్ శాఖలో ఉన్న పలువురు ఏడీఈలు, ఏఈలు, సిబ్బందితో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కోంటున్న డీఈ శ్రీనాథ్ రెడ్డి కూడా సదరు కార్మికుడిని ఆస్పత్రిలో పరామర్శించినట్లు సమాచారం. ఈ మేరకు కార్మికుడి చికిత్స నిమిత్తం సుమారు రూ. 14 లక్షలను ఆర్టిజన్ నర్సింహులు ఉన్నతాధికారుల భరోసాతో ఖర్చు చేశాడు. సదరు చికిత్స ఖర్చులు, నష్ట పరిహారం చెల్లింపు విషయంలోనే డీ ఈ శ్రీనాథ్ రెడ్డి, అరిజన్ నర్సింహులుకు నడుమ తగాదా జరిగి విషయం పోలీసు స్టేషన్ కు చేరి కేసుకు దారితీసింది.
వారి సమక్షంలో ఒప్పుకొని… అనంతరం బుకాయింపా…?
కార్మికుడి చికిత్స నిమిత్తం ఖర్చు చేసిన డబ్బుల విషయం నర్సింహులు పలుమార్లు డీఈ శ్రీనాథ్ రెడ్డి దృష్టికి తీసుకు రాగా ఆయన పెడచెవిన పెడుతూ వచ్చాడు. దీంతో నర్సింహలు సంఘటన చోటు చేసుకున్న ప్రాంతానికి చెందిన మూడు చింతలపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్, మాజీ సర్పంచ్ బాల నర్చిం హా మరి కొంతమంది పెద్దలతో పాటు శామీర్పేట ఏడీఈ రమణారెడ్డి, అలియాబాద్ ఏఈ శ్రీనివాస్ తో కలిసి ఒకమారు, యూనియన్ సంఘం సభ్యులతో వెన్నెలగడ్డలోని డీఈ కార్యాలయంలో శ్రీనాథ్ రెడ్డి తో మరోమారు భేటీ అయ్యారు. ఈ రెండు బేటీల్లో పెద్దలు, అధికారులు, యూనియన్ సభ్యుల సమక్షంలో అంతా సానుకూలంగా స్పందించిన డీఈ తప్పకుండా నర్సింహులుకు న్యాయం చేస్తానని, అన్ని విషయాలు తనకు తెలుసని ఒప్పుకోవడమే కాకుండా వచ్చిన వారందరితో ఆప్యాయంగా ఫోటోలు కూడా దిగారు. డీఈని అనంతరం పలుమార్లు తన డబ్బుల కోసం వెళ్లిన నర్సింహులును పట్టించుకోకపోవడం, ఇటీవల కులం పేరు దూషించాడనే ఆరోపనలతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడం జరిగిపోయాయి. ఇంత తతంగం, భేటీలు జరిగినా సదరు విషయం గురించి నాకేమీ తెలియదు, నా దృష్టికి రాలేదని డీఈ బుకాయించడం గమనార్హం.