నాడు ప్రభుత్వ స్థలం… నేడు ప్రైవేట్ స్థలమని నివేదికా…?

~ ఎర్రకుంట చెరువు సర్వేలో అధికారుల నిర్వాకం
~ అక్రమార్కులకు అండగా సర్వే విభాగ ఏడి, డిఐ, స్థానిక తహసీల్దార్
~ ఇరిగేషన్ ఎన్ ఓ సి లు లేకుండా తప్పుడు సర్వే నెంబర్లు, పత్రాలతో అనుమతులు
~ సర్వే చేసి మూడు మాసాలు గడుస్తున్న కలెక్టర్ కు నివేదిక ఇవ్వని అధికారుల చిత్తశుద్ధి
~కోట్ల రూపాయలు దండుకొని కోఆర్డినేట్ లు సైతం మార్పు
~ ఎర్రకుంట చెరువు దగ్గర పత్రికా సమావేశాన్ని నిర్వహించిన నిజాంపేట్ బిజెపి నాయకులు.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 11:   నాడు ప్రభుత్వ భూమి, చెరువు స్థలం అని సూచిక బోర్డులు, ప్రహరీ కట్టి ఏకంగా గేట్లను ఏర్పాటు చేసి, నేడు ప్రైవేటు స్థలమని నివేదికలు అందించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని నిజాంపేట్ బిజెపి నాయకులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో బిజెపి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ వివరాలు వెల్లడించారు.

ఎర్రగుంట చెరువులో నిర్మాణాలు చేస్తున్న మాప్స్ నిర్మాణ సంస్థ

బాచుపల్లి లోని సర్వే నంబర్ 134 లో ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎర్రకుంట చెరువుగా పేర్కొన్న స్థలంలో ఇరిగేషన్ నుంచి ఎటువంటి నిరభ్యంతర పత్రాలు (ఎన్ఓసిలు) లేకుండానే చెరువు స్థలంలో మూడు భారీ కట్టడాలు అక్రమ మార్గంలో నిర్మిస్తున్నారన్నారు. ఇరిగేషన్ ఎన్ ఓ సీ లేకుండానే అనుమతులు మంజూరు చేసిన హెచ్ఎండిఏ అధికారులపై పలుమార్లు బిజెపి ఫిర్యాదు చేసిందని, దాంతో మార్చి 18వ తేదీన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సర్వే బాగా విభాగ సహాయ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ గంగాధర్, బాచుపల్లి తాసిల్దార్ ఫుల్ సింగ్ లు సంయుక్త సర్వేను చేశారన్నారు.

ప్రభుత్వ స్థలంగా సూచిస్తున్న గేటు

సర్వే చేసి మూడు మాసాలు గడుస్తున్నా దానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ ను సదరు అధికారులు కలెక్టర్ కు అందించకపోవడంలో మర్మం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా అన్ని రికార్డులలో, భౌతికంగా ప్రభుత్వ భూమి చెరువు స్థలం అని స్పష్టమవుతున్న వారి నివేదికలో ప్రైవేటు భూమిగా చూపిస్తున్నారని, అది కేవలం ప్రైవేటు ప్రైవేట్ వ్యక్తుల కబంధహస్తాలకు ప్రభుత్వ భూములను అప్పగించేందుకు మాత్రమే వారు ఉద్యోగాలు చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాదారులను పెంచి పోషించడం, అక్రమాలను ప్రోత్సహించడమే వారి విధిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

ఎర్రకుంట చెరువు బఫర్ జోన్ చేపడుతున్న నిర్మాణం

ఎర్రకుంట చెరువులో నిర్మిస్తున్న మాప్స్ నిర్మాణ సంస్థ తో పాటు ఓ కార్పొరేటర్, మరి కొందరు నిర్మాణాలకు చెందిన బిల్డర్లకు లబ్ధి చేకూర్చడం కోసం చెరువు కోఆర్డినేట్ల ను కూడా సుమారు 9 మీటర్ల మేర జరిపారని ఆరోపించారు. దీంతో మార్చి 11వ తేదీన నిర్వహించిన సర్వేలో మూడు ఎకరాలుగా చూపిస్తే అదే నెల 18వ తేదీన చేసిన సర్వేలో 2.19 ఎకరాలు గానే చూపించిందని వివరించారు. ఒక వారం వ్యవధిలో చేసిన సర్వేలో అంత తేడా ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమి చెరువు కోఆర్డినేట్స్ మార్చడానికి సర్వే ఏడి, డిఐ లు నిర్మాణదారుల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారని, అందుకే వారికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ స్థలం చెరువు భూమిని వారికి అంటగట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఎర్రగుంట చెరువు ఎఫ్ టి ఎల్లో నిర్మితమవుతున్న నిర్మాణం

తప్పుడు సర్వే నెంబర్లు, తప్పుడు పత్రాలతో అనుమతులు పొందిన బిల్డర్లపై, దానికి సహకరిస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమి చెరువు స్థలాన్ని రక్షించాలన్నారు. గత తొమ్మిది ఏళ్లుగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు కబ్జాల కు సహకరించి, అనుమతులు ఇప్పించి ఇప్పుడు చెరువులు కాపాడాలని ఎమ్మెల్యే వివేకానంద్ చెరువులను పరిశీలించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎర్రకుంట చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు. ఎర్రకుంట చెరువులో అక్రమ అనుమతులు, ఆక్రమణలు తప్పుడు రిపోర్టులపై కలెక్టర్ గౌతం, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి దృష్టి సారించాలన్నారు. చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అక్కడ నిరాహార దీక్ష కు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ సెక్రటరీ అరుణ్ రావు, మీడియా సెల్ కో- కన్వీనర్ ఉదయ్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ప్రసాద్ రాజు, ఉపాధ్యక్షులు మాధవరావు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ముఖేష్, సీనియర్ నాయకులు ఎల్లస్వామి, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More