నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డ్ పైనుంచి వెళ్లిన రెడీమిక్స్ లారీ
~ పోలీసుల అదుపులోనే లారీ డ్రైవర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 5: నిద్రిస్తున్న ఆ సెక్యూరిటీ గార్డ్ కు తెలియదు పాపం… తన జీవితం తెల్లవారకముందే తెల్లవారి పోతుందని, మేల్కొనేలోపే మృత్యు రూపంలో వచ్చిన లారీ తనను అనంత లోకాలకు తీసుకెళ్తుందని. అందుకే తాను పని చేసే చోట ఆరుబయట హాయిగా నిద్రించాడు. కానీ… మృత్యు రూపంలో వచ్చిన ఓ రెడీమిక్స్ లారీ ఆ సెక్యూరిటీ గార్డు బ్రతుకును చిదిమేసింది.
ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… బీహార్ రాష్ట్రం భోజ్పూర్ ఆరా జిల్లా ( చౌరీ తానా) లోని దలియాలాఖ్ గ్రామానికి చెందిన హరే రామ్ సింగ్ (49) నగరంలోని కావేరి సెక్యూరిటీ ఏజెన్సీ తరపున కొంపల్లి లోని మై స్పేస్ ఔరా అనే నిర్మాణ సంస్థ నూతనంగా చేపడుతున్న భవన నిర్మాణ సముదాయాల వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మంగళవారం రాత్రి తాను పనిచేసే భవన నిర్మాణ సముదాయాల వద్ద ఆరుబయట నిద్రించాడు. అక్కడకు బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు గండి మైసమ్మ లోని జైదార్ కాంక్రీట్ సంస్థకు చెందిన రెడీమిక్స్ కాంక్రీట్ లారీ (టీఎస్ 08 జేపీ 8580) వచ్చింది. ఆ సమయంలో అక్కడ నిద్రిస్తున్న హరే రామ్ సింగ్ ను గమనించని పంజాబ్ కు చెందిన లారీ డ్రైవరు సోమేష్ (25) లారీని వెనుకకు తీస్తూ అతని పైకి ఎక్కించాడు. దీంతో హరే రామ్ సింగ్ ముఖము, శరీరం చిద్రమై అక్కడికక్కడే మరణించాడు.
సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లారీని నిర్లక్ష్యంగా నడిపి తన బాబాయ్ చావుకు కారణమైన డ్రైవర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువు మహేష్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ సోమేష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు.