నిమిషం ప్రయాణానికి నిండు ప్రాణాన్ని బలి చేసుకుంటున్నారు. – మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి
~ సుచిత్రా కూడలిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు
~ రాంగ్ రూట్ లో వస్తున్న 32 మంది వాహనదారులను పట్టుకున్న పోలీసు సిబ్బంది
~ అందులో 20 మంది మొదటిసారి పట్టు పడగా, 12 మంది రెండవసారి పట్టుబడ్డారు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 23 : ప్రతీ వాహన చోదకుడు మంచి పౌరుడిగా ఉంటూ ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని మేడ్చల్ ట్రాఫిక్ ఏసిపి కె. వెంకటరెడ్డి అన్నారు. సుచిత్ర కూడలి లో ఏసిపి, ఆల్వాల్ ట్రాఫిక్ సిఐ నాగేశ్వరరావు తో కలిసి ప్రత్యేక డ్రైవ్ ను ఆదివారం నిర్వహించారు. ఈ డ్రైవ్ లో రాంగ్ రూట్ లో వస్తున్న 32 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 12 మంది ఇదివరకు ఒకసారి పట్టుబడి, మరల అదే తప్పు చేస్తూ రెండవసారి దొరికారని, 20 మంది తొలిసారి పట్టుబడారని ఏసిపి తెలిపారు. తొలిసారి పట్టుబడిన వారికి జరిమానా విధించి, కౌన్సిలింగ్ నిర్వహించి పంపిస్తామని తెలిపారు. రెండోసారి దొరికిన 12 మంది పై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు.
రాంగ్ రూట్, మద్యం సేవించి వాహనం నడపడం, నెంబర్ ప్లేట్లు, లైసెన్స్ లు లేకుండా వాహనాలు నడిపే వారికి నిరంతరం అవగాహన కల్పిస్తున్న వాహనదారుల్లో మార్పు రావడంలేదని ఆయన అన్నారు. రాంగ్ రూట్ లో వచ్చి తాము ప్రమాదానికి గురి కావడమే కాకుండా సరైన మార్గంలో వెళ్లే వారిని ప్రమాదాలకు గురి చేసి వారి ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నారన్నారు. ఒక నిమిషం ప్రయాణానికి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ప్రాణాలు కోల్పోయి కుటుంబాల్లో కడుపుకోత మిగులుస్తున్నారన్నారు. అనంతరం పట్టుబడిన వాహన చోదకులకు ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో ట్రాఫిక్ ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.