పౌర హక్కుల దినాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 31 : జీడిమెట్ల డివిజన్ పరిధి అంగడిపేటలో కుత్బుల్లాపూర్ మండల డిప్యూటీ తహసిల్దార్ అశ్విన్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పౌర హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రేణుకా దేవి, ఏఎంసి కృష్ణ, పౌరసరఫరాల శాఖ ఇన్స్ పెక్టర్ మాతేష్, విద్యుత్ ఏఈ జ్ఞానేశ్వర్, జలమండలి ఏఈ శివ ప్రసాద్, పోలీసులు పాల్గొని ప్రసంగించారు. పౌర హక్కుల దినాన్ని ప్రతి పౌరుడు వినియోగించుకొని వారి సమస్యల పరిష్కారానికి సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. రాజ్యాంగం లోని హక్కులతో పాటు విధులను కూడా సక్రమంగా నిర్వహించేలా పౌరులందరూ చైతన్య కలిగి ఉండాలన్నారు. దళితులు బడుగు బలహీన వర్గాల వారికి నిధులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు అధికారులను కోరారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఉచిత ఇళ్లను, పెన్షన్లను, తెల్ల రేషన్ కార్డును, ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించాలన్నారు. అర్హులైన వారికి కాకుండా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇష్టానుసారం కేటాయించాలని, వాటిపై పునర్విచారణ జరిపించి అర్హులైన పేదలకు అందించాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్తు, తాగునీటి సరఫరా లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అధికారులు పౌరులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. పలు ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మన సమస్యలపై అధికారులకు వినతి పత్రాలను దళిత సంఘం నాయకులతో పాటు స్థానిక ప్రజలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం సీనియర్ నాయకులు అవిజె జేమ్స్, ఆనంద్ బాబు, అశోక్, డీవీఎంసీ సభ్యులు కిషన్ రావు, అనిల్, కవిత, ఇంద్ర, స్వప్న పాల్గొన్నారు