ప్రజావాణి ఫిర్యాదు ఒక సర్కిల్లో… వివరణ మరో సర్కిల్లో…

• గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారుల తీరు
• ఫిర్యాదుదారులనే పక్కదోవ పట్టించేలా రిప్లైలు
• ఫిర్యాదులపై కనీస చిత్తశుద్ధి లేని వైనం
• ఒక సర్కిల్లో ఫిర్యాదు చేస్తే మరో సర్కిల్లో జవాబు ఇచ్చారంటూ…
• ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడు
• సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖపర చర్యలు తీసుకోవాలని డిమాండ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 2: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారులనే తప్పుదోవ పట్టించేలా ఉంది గాజులరామారం సర్కిల్ పట్టణ ప్రణాళిక అధికారుల (టౌన్ ప్లానింగ్) పనితీరు. తాము ఏ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్నాం..? ఏ సర్కిల్ పరిధిలోని సమస్యపై వివరణ ఇస్తున్నాం…? అనే కనీస అవగాహన కూడా లేకుండా వ్యవహరించడమే అందుకు నిదర్శనం. గాజులరామారం సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా కుప్పలు తెప్పలుగా కళ్ళముందే వెలుస్తున్నా.. అక్రమ నిర్మాణదారుల నుంచి అందినకాడికి దండుకుంటూ జేబులు నింపుకుంటున్న పట్టణ ప్రణాళిక అధికారులు.. కనీసం వాటిపై అందిన ఫిర్యాదుల పైన అయినా సరైన రీతిలో స్పందించలేని, వివరణ ఇవ్వలేని దుస్థితి ప్రజలను విస్మయానికి గురిచేస్తుంది. తాము పని చేస్తున్న, తమకు సంబంధించిన సర్కిల్లోని సమస్యపై ఫిర్యాదు అందితే, తమకు ఎటువంటి సంబంధం లేని పక్క సర్కిల్లోని సమస్యపై స్పందిస్తూ వివరణ ప్రతిని ఫిర్యాదుదారుడికి అందించడంలోనే గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారుల చిత్తశుద్ధి అర్థమవుతుంది.

గాజులరామారం పట్టణ ప్రణాళిక అధికారులు ఇచ్చిన తప్పుడు వివరణ ప్రతి

• ఫిర్యాదు గాజులరామారంలో.. వివరణ కుత్బుల్లాపూర్ లో…
గాజులరామారం సర్కిల్ పరిధి గాజులరామారం డివిజన్ మిథిలా నగర్ లోని రోడ్ నెంబర్ 4లో సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా ఓ నిర్మాణదారుడు అక్రమ షెడ్డుతో పాటు వ్యాపార అవసరాల కోసం అక్రమ షట్టర్లను నిర్మిస్తున్నాడు. ఈ విషయంపై గత నెల 12వ తేదీన సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఓ వ్యక్తి ఫిర్యాదును అందజేశాడు. ఈ మేరకు సదరు అక్రమ నిర్మాణం పై ఎటువంటి చర్యలు తీసుకొని పట్టణ ప్రణాళిక అధికారులు ఫిర్యాదుదారుడికి అదే నెల 17వ తేదీన పక్కనే ఉన్న కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సుభాష్ నగర్ లోని నాలా ఆక్రమించుకొని నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ వివరణ ప్రతి (ఎల్ఆర్. నెంబర్. 169/టిపిఎస్/సి-26/కేజడ్/జిహెచ్ఎంసి/2024)ని అందించి సమాధానం ఇవ్వడం విశేషం. సదరు వివరణ ప్రతిని చూసి అవాక్కైన ఫిర్యాదుదారుడు తప్పుడు సమాచారాన్ని సవాలు చేస్తూ సెప్టెంబర్ 2న ప్రజావాణిలో గాజులరామారం సర్కిల్ ఉప కమిషనర్ ఎల్. పి. మల్లారెడ్డికి మరో ఫిర్యాదును అందజేశాడు. ప్రజావాణిలో అందించిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఫిర్యాదుదారులను తప్పుదోవ పట్టించేందుకు విధంగా వ్యవహరిస్తూ, తప్పుడు సమాచారం అందించిన సర్కిల్ పట్టణ ప్రణాళిక డిసిపి, టీపీఎస్ లతోపాటు బాధ్యులైన వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. అంతకుముందు తాము ఫిర్యాదు చేసిన అక్రమ నిర్మాణంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు వారికి అందజేసిన నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్ నకలు ప్రతులను అందించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More