ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే… చట్టరీత్యా చర్యలు తప్పవు
– పేట్ బషీరాబాద్ సర్వేనెంబర్ 25/1, 25/2 లో ఆకస్మిక తనిఖీలు చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
– ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ఆదేశం
– ఆయా సర్వే నెంబర్లలో సుమారు 38 ఎకరాలు హెచ్ఎండిఏకు, 7 ఎకరాలు ఆర్జికె కు ఇప్పటికే కేటాయింపు
– త్వరలోనే రక్షణ కంచె ఏర్పాటుకు చర్యలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 23 : కుత్బుల్లాపూర్ మండలంలోని పేట్ బషీరాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 25/1, 25/2 లో ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మల్కాజ్ గిరి ఆర్డీవో శ్యాంప్రకాష్, కుత్బుల్లాపూర్ తహసిల్దార్ రెహమాన్ ఖాన్, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రేణుకా దేవి తో కలిసి ఆయా సర్వేనెంబర్లలోని ప్రభుత్వ స్థలాలను మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వ స్థలాలు ఏ మేరకు ఉన్నాయి… వాటిని ఎలా పరిరక్షించవచ్చు అనే అంశాన్ని అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. సర్వేనెంబర్ 25/1 25/2 లోని ప్రభుత్వ స్థలంలో విచ్చలవిడిగా వెలసిన అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు. ఆయా సర్వే నెంబర్లలో సుమారు 38 ఎకరాలు హెచ్ఎండిఏకు కేటాయించినట్లు, అలాగే సుమారు 7 ఎకరాలు ఆర్ జి కె హౌసింగ్ సొసైటీకి అప్పగించినట్లు తెలిపారు. హెచ్ఎండిఏ, ఆర్ జి కె సంస్థలు ప్రభుత్వ స్థలాలను తమ ఆధీనంలోకి తీసుకునే వరకు రెవెన్యూ అధికారులు ఆయా భూములను కాపాడాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు త్వరలోనే రక్షణ కంచెను ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించిన, అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టరీత్య చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.