భవన నిర్మాణ మెటీరియల్ లిఫ్టింగ్ క్రేన్ వైర్లు తెగిపడి ప్రమాదం
~ ఓ కార్మికుడు మృతిచెందగా… మరో కార్మికుడికి తీవ్ర గాయాలు
నిజాంపేట (న్యూస్ విధాత్రి), జూలై 3 : ఓ భవన నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మాణ సామాగ్రిని పై అంతస్తులకు యంత్రం (మెటీరియల్ లిఫ్టింగ్ మెషిన్) సహాయంతో చేరవేసే సమయంలో ప్రమాదం జరిగిన సంఘటన బాచుపల్లి పిఎస్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం… బాచుపల్లిలోని కౌసల్య కాలనీ సూర్య గ్లోబల్ పాఠశాల సమీపంలో డాల్ఫిన్ కన్స్ స్ట్రక్షన్ సంస్థ బహుళ అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మిస్తుంది. నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మాణ సామాగ్రిని క్రేన్ సహాయంతో పై అంతస్తులకు చేరవేసే క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ వైర్లు తెగి అక్కడే ఉన్న విద్యుత్ ప్రధాన లైను తీగలపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో రాములు (56) అనే కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కార్మికుడు తీవ్రగాయాలతో సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.