భూకబ్జాదారుల ఆగడాలకు హద్దేది….?
✓ పేదల భూముల ఆక్రమణలే లక్ష్యంగా కేఎల్ యూనివర్సిటీ భౌతిక దాడులు
✓ భూమివైపు వస్తే చంపేస్తామంటూ బెదిరింపులు
✓ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
✓భూబకాసురుల వరుస సంఘటనలు
✓ ఒకటి మరువక ముందే.. మరొకటి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 19: ఓ పక్క కొన్ని యునివర్సిటీలు, విద్యా సంస్థలు.. మరో పక్క బడా నిర్మాణ సంస్థలు రైతులు, పేదలతో పాటు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలే తమ లక్ష్యంగా భూములను కబళిస్తూ.. భూబకాసులుగా మారుతున్నారు. గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్న భుముల ధరలకు రెక్కలొస్తున్న తరుణంలో వాటిని ఎరగేసుకుపోవడానికి గద్దల కాసుకొని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేందుకు సిద్ధ పడుతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. వారికి ఉన్న కొద్దో… గొప్పో… స్థలంతో పాటు చుట్టు పక్కల ఉన్న విలువైన స్థలాలను కూడా వారి ఆధీనంలోకి తీసుకొని సర్వం స్వాహా చేయాలనే ఉద్దేశ్యంతో సర్వశక్తులతో పన్నగం పన్నుతున్నారు. దీని కోసం అల్లరి మూకలు, రౌడీలు, ప్రైవేటు సైన్యంతో బెదిరింపులే కాకుండా భౌతిక దాడులతో పాటు భూకబ్జాదారుల పలుకుబడితో చేస్తున్న ఒత్తిడికి బాధితులు ప్రాణాలను సైతం వదిలేస్తున్నారంటే.. ఏ స్థాయికి భూ ఆక్రమణదారుల ఆగడాలు చేరుకున్నాయో ఇట్టే… అర్థం చేసుకోవచ్చు.
√ రైతు మరణం మరువక ముందే కేఎల్ యూనివర్సిటీ దాడి….
ఇటీవల భూబకాసురుల వేధింపులు తాళలేక తనయుడు లేఖ రాసి ఆదృశ్యమవ్వగా, తనయుడి కోసం బెంగ పెట్టుకొని తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం విధితమే. భౌరంపేటకు చెందిన వంపుగూడెం మాధవరెడ్డి అనే రైతుకు దొమ్మర పోచంపల్లిలోని సర్వే నెంబర్ 188లో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.13 ఎకరాల స్థలం ఉంది. దీనిని తమకు అమ్మాలని పక్కకనే ఉన్న త్రిపుర ల్యాండ్ మార్కు నిర్మాణ సంస్థ అడగగా రైతు దానికి నిరాకరించడంతో అప్పటి నుంచి కక్ష కట్టి రైతుకు చెందిన భూమిని దౌర్జన్యంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేశారు. త్రిపుర ల్యాండ్ మార్కు యజమాని వసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్
మేకల వెంకటేశం తమ పలుకుబడిని ఉపయోగించి రైతు మాధవరెడ్డిని నానా విధాల ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మాధవరెడ్డి ఇళ్లు వదిలి పెట్టి వెళ్లిపోవడంతో అతని తండ్రి కృష్ణారెడ్డి దానిని తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన జరిగి పట్టుమని వది రోజులు కూడా కాకుండానే మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11వ తేదీన రైతు మరణించిన సంఘటన చోటు చేసుకోగా.. రెండు రోజుల వ్యవధిలోనే 13వ తేదీన మరో భూవివాద విషయంలో కేఎల్ యూనివర్సిటీ ఓ బాధితుడిపై దాడి చేసింది.
√ కేఎల్ యాజమాన్యం మిమ్మల్ని చంపి పేగులు మెడలో వేసుకోమన్నారు…
గాజులరామారంలోని సర్వే నెంబర్ 434/1, 435/1లో దారా పద్మావతికి ఆమె తండ్రి బొడ్డు రఘుపతి నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. ఈ నెల 13వ తేదీన (శనివారం) సదరు స్థలంలోకి వెళ్తుంటే కేఎల్ యూనివర్సిటీ సెక్యూరిటీ, అందులో పని చేసే సూపర్వైజర్ వారిని తమ స్థలంలోకి వెళ్లకుండా
అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. దీంతో పద్మావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న కేఎల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా…అని పద్మావతి కుమారుడు దారా నర్సింగ్ రావుపై భౌతిక దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతేకాకుండా సదరు స్థలం కేఎల్ యూనివర్సిటీదని, మా యాజమాన్యం మిమ్మల్ని చంపి పేగులు మెడలో వేసుకోమన్నారని.. మళ్లీ ఇటువైపు వస్తే చంపేస్తామని సిబ్బంది బెదిరించారని బాధితురాలు పద్మావతి పేర్కొన్నారు. ఇప్పటికైనా సదరు భూవిషయంలో అధికారులు విచారణ చేపట్టి తమ ప్రాణాలకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
√ భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి.- సీపీఐ
కేఎల్ యూనివర్సిటీ సిబ్బంది చేసిన దాడిపై బాధితులతో కలిసి సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ షాపూర్ నగర్ లోని కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. గతంలో కూడా గాజులరామారంలో స్థలాలను ఆక్రమించుకొనేందుకు పేదలు, రెవెన్యూ అధికారులు, విలేకరులపై భూ కబ్జాదారులు అనేక దాడులు చేశారని, భూకబ్జాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు మరల పునరావృతం అవుతున్నాయని ఉమామహేష్ అన్నారు. పేదలపై పాశవిక దాడులకు పాల్పడుతున్న కబ్జాదారులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వలోనైనా భూకబ్జాల విషయంలో ఎటువంటి మార్పు రాకపోగా ప్రజలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులపై ఇప్పటి వరకు నమోదైన కేసుల ఆధారంగా వారిపై చట్టరిత్యా చర్యలు చేపట్టి పీడీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నియోజకవర్గంలోని భూములు కోల్పోయిన బాధితులందరితో కలిసి పోలీసు కమిషనర్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి వరకు తీసుకెళ్లి పోరాటం చేస్తామని హెచ్చరించారు.