మేడ్చల్ జిల్లాలో మూడో రోజు ఏడు నామినేషన్లు దాఖలు
– మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
మేడ్చల్ (న్యూస్ విధాత్రి ప్రతినిధి), నవంబర్ 6: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి మూడవ రోజైన సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్, కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక నామినేషన్, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు నామినేషన్లు సంబంధిత ఆర్వోలు స్వీకరించారని పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చింతల అంకాలమ్మ భరోసా పార్టీ నుంచి, కుత్భుల్లాపూర్ నుంచి దొంతుల భిక్షపతి స్వతంత్ర అభ్యర్థిగా, కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుధాకర్ యాదవ్, చలిక పార్వతి, చలిక చంద్రశేఖర్లు స్వతంత్ర అభ్యర్థులుగా, ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎ.దేవేందర్, బొజ్జా యాదగిరి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్ కూడా రాలేదని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.