మేడ్చల్ విద్యుత్ డి ఈ పై ఎస్సీ ఎస్టీ కేసు
~ కులం పేరుతో దూషించాడని ఆర్టిజన్ ఫిర్యాదు
~ ప్రమాదంలో కాళ్లు చేతులు కోల్పోయిన కార్మికుడి చికిత్స ఖర్చులు భరించిన ఆర్టిజన్
~ సదరు చికిత్స ఖర్చులు నష్టపరిహారం విషయంలో వివాదం
~ కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 25 : తనకు రావాల్సిన డబ్బులు అడిగితే ఇవ్వకపోగా తనను ఓ ఉన్నతాధికారి కులం పేరుతో దూషించాడంటూ ఓ విద్యుత్తు ఆర్టిజన్ పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ ఉన్నదాధికారిపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత నేపథ్యంలో పలు సందర్భాల్లో మరమ్మతుల నిమిత్తం బయట నుంచి ఎలక్ట్రిషన్, టెక్నీషియన్లను నియమించుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఓ వ్యక్తి విద్యుదాఘాతాని గురై కాళ్లు చేతులు కోల్పోగా, అతని చికిత్స కోసం చేసిన ఖర్చు, నష్టపరహార విషయంలో మేడ్చల్ విద్యుత్ డి ఈ శ్రీనాథ్ రెడ్డి, మూడు చింతలపల్లి లో పనిచేస్తున్న ఆర్టిజన్ నడుమ వివాదం రేకెత్తింది.
అసలేం జరిగింది…
మూడు చింతలపల్లి పరిధిలో 2022 మే నెలలో విద్యుత్ మరమ్మత్తుల నిమిత్తం డి ఈ శ్రీనాథ్ రెడ్డి, ఏడి శంకర్ నాయక్, ఏ ఈ శ్రీకాంత్ సూచనతో ఆర్టిజన్ బైండ్ల నరసింహులు బయట నుంచి శేఖర్ అనే విద్యుత్ కార్మికుడిని తీసుకు వచ్చి పనులు చేయించాడు. సదరు కార్మికుడు విద్యుత్ స్తంభంపై విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి లోనై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా గాయాలు తీవ్రంగా ఉండటంతో శేఖర్ కు కాళ్లు, చేతులు తొలగించారు. చికిత్సకు అయ్యే ఖర్చును అందరు భరించే విధంగా ఒప్పుకోవడంతో ఆర్టిజన్ నరసింహులు సుమారు రూ. 14 లక్షల వరకు ఖర్చు చేయటం జరిగిందని సమాచారం. ఆ డబ్బు విషయంలోనే డి శ్రీనాథ్ రెడ్డికి తనకు ఇటీవల తగాదా జరిగిందని, ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించాడని ఆర్టిజన్ నరసింహులు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన కార్మికుడి విషయం మా దృష్టికి రాలేదు
ఇదే విషయంపై డి ఈ శ్రీనాథ్ రెడ్డి ని న్యూస్ విధాత్రి వివరణ కోరగా… అసలు విద్యుత్ కార్మికుడికి ప్రమాదం జరిగినట్లు కానీ, నష్టపరిహారం చెల్లించాలని కానీ తమ రికార్డుల్లో లేదని, తన దృష్టికి రాలేదని తెలిపారు. ఆర్టిజన్ నరసింహులు విషయంలో అప్పట్లో తాను తీసుకున్న సెలవుల విషయమై వేతన సమస్య వస్తే దానిని అప్పుడే పరిష్కరించామని, అంతకుమించి మరే విషయము మా దృష్టికి రాలేదని తెలిపారు.
– శ్రీనాథ్ రెడ్డి, డి ఈ, మేడ్చల్ విద్యుత్ విభాగం