రిటైర్డు ఏఈ రామారావు వల్లే చెరువులన్నీ రాం…రాం…!

✓ కుత్బుల్లాపూర్ లోని 10 చెరువులు, నాలాల ఆక్రమణలకు ఆయనే కారణం
✓ పదవీ విరమణ పొంది పది సంవత్సరాలు గడుస్తున్న అదే పదవిలో…
✓ గత బిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, బిల్డర్ల అండదండలతోనే…
✓ కనుమరుగవుతున్న చెరువులు… ఇళ్లల్లోకి చేరుతున్న వర్షం నీరు
✓ ఇరిగేషన ఈఈకి ఫిర్యాదు చేసిన నిజాంపేట బిజెపి నాయకులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 23 :  పదవి విరమణ పొంది 10 సంవత్సరాలు గడుస్తున్న నిబంధనల విరుద్ధంగా ఇరిగేషన్ ఏఈగా కొనసాగుతున్న రామారావును వెంటనే తొలగించి నూతన ప్రభుత్వ ఏఈని నియమించాలని బిజెపి నిజాంపేట మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఇరిగేషన్ ఈఈకి నగరంలోని తన కార్యాలయంలో మంగళవారం వినతి పత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్ పరిధిలో 10 చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణ యదేచ్చగా కొనసాగుతున్నాయని, దానికి రిటైర్డ్ ఏఈ ప్రధాన కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిటైర్డ్ ఏఈకి చెరువుల పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి లేదని, తక్షణమే నూతన ఏఈని నియమించాలని వారు డిమాండ్ చేశారు. జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిల్ పరిధిలో 10 చెరువులైన లింగం చెరువు, చిన్న బంధం కుంట, పంతులు కుంట, మహబూబ్ కుంట, పెద్ద చెరువు, బంధం కుంట, చింతల చెరువు, మధ్యల చెరువు, కాలమన కుంట, వడ్డవాని కుంట ఆక్రమణలకు గురవుతున్నాయని అన్నారు. 10 చెరువుల్లో గతంలో 3 చెరువులకు రక్షణ కంచెను ఏర్పాటు చేశారని, ఆ కంచెను సైతం తొలగించి చెరువులతో పాటు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లలోని స్థలాలను గత 9 సంవత్సరాలుగా దర్జాగా కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. చెరువులు ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు తుతూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. చెరువులు, నాలాల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు జరగడానికి ఇరిగేషన్ ప్రథమ ముద్దాయి అయితే… రెవెన్యూ రెండవ ముద్దాయిగా, మూడో ముద్దాయి రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ బఫర్ జోన్ లో మట్టి పోసి చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న రిటైర్డ్ ఇరిగేషన్ ఏఈ రామారావు

~ పదవీ విరమణ పొందిన అన్ని తానై…
పదవి విరమణ పొంది 10 సంవత్సరాలు గడుస్తున్న ఇరిగేషన్ ఏఈ రామారావు అదే పదవిలో కొనసాగుతూ చెరువులు, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలకు నిరభ్యంతర పత్రాలను (ఎన్ఓసిలు) ఇస్తున్నాడని, జంట సర్కిళ్ల జిహెచ్ఎంసి పరిధిలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొని ఇరిగేషన్ విభాగంలో అన్ని తానై చలామణి అవుతూ చెరువుల ఆక్రమణలకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారన్నాడు. దీంతో కుత్బుల్లాపూర్ లో చెరువుల పరిరక్షణ గాల్లో దీపంలా మారిందన్నారు.

✓ 70 శాతం గొలుసుకట్టు చెరువుల నాలాలు కబ్జా…
కుత్బుల్లాపూర్ పరిధిలో లింగం చెరువు నుంచి పరికి చెరువు వరకు, పంతులు చెరువు నుంచి పరికి చెరువు ఇరిగేషన్ గొలుసుకట్టు చెరువుల నాలాలు 70 శాతం కబ్జాకు గురయ్యాయన్నారు. దీనివల్ల సూరారం గాజులరామారం పరిధిలోని పలు ప్రాంతాల్లో వరదలు వచ్చిన ప్రతి సారీ ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని తక్షణమే 10 చెరువుల పరిరక్షణకు సర్వే చేసి, ఫైనల్ నోటిఫికేషన్ తో హెచ్ఎండిఏ సైట్ లో మ్యాపులను పొందుపరచాలని, అలాగే ఎఫ్ టి ఎల్ పాయింట్ల వద్ద పిల్లర్స్ మున్సిపల్ అధికారుల సహకారంతో ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా వరద నీటి కాలువ పరిరక్షణకు తగిన చర్యలు చర్యలు తీసుకొని వాటిని కాపాడాలన్నారు. వినతి పత్రం అందించిన వారిలో సీనియర్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, మురళి ,అరుణ్ రావు, మాధవరావు, ముకేష్ గౌడ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More