వాల్టాకు తూట్లు… నిబంధనలకు ‘నీళ్లు’….
√ అక్రమ నీటి దందా.. దర్జాగా…
√ సూరారం గ్రామం సర్వే నెంబర్ 192లో భూగర్భ జలాలు….
√ పంతుల చెరువులో నీటిని తోడేస్తూ మరీ నీటి దందా
√ ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లోకి చొరబడి నీటి చౌర్యం
√ ట్యాంకర్లు నింపుతూ…జేబులు నింపుకుంటున్నారు
√ నీటిని శుద్ధి చేసి రసాయన, ఔషధ పరిశ్రమలకు సరఫరా
గాజులరామారం (న్యూస్ విధాత్రి), జూన్ 25 : చుట్టు పక్కలంతా అటవీ ప్రాంతం…దాని మధ్యలో సుమారు 40 ఎకరాల చెరువు అక్కడికి వెళ్లాలంటేనే సామాన్యులు ఒకింత అలోచించాల్సిందే. కానీ… దానినే అదనుగా చేసుకొని అక్కడికి ఎవరు రారనే ధైర్యంతో కొందరు నీటి చోరులు ఏకంగా వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలను తోడేస్తూ… నీటి దందాలు చేసి లక్షల్లో దండుకుంటున్నారు. ఇష్టానుసారం బోర్లు వేయడమే కాకుండా చెరువులోని నీటిని సైతం లాగేస్తూ ట్యాంకర్లతో నీటిని నింపుకొని అమ్ముకుంటూ పరిశ్రమలకు సరఫరా చేసి వారి జేబులు నింపుకుంటున్నారు.
~ సూరారం గ్రామం సర్వే నెంబర్ 192లో…
కుత్బుల్లాపూర్ మండల పరిధి గాజులరామారం సర్కిల్ లోని సూరారం గ్రామం సర్వే నెంబర్ 192లో సుమారు 40 ఎకరాల
పైచిలుకు విస్తీర్ణం గల పంతుల చెరువు ఉంది. చెరువును అనుకొని ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లోకి అక్రమంగా కొందరు చొరబడి ఇష్టానుసారం నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా వ్యవసాయ బోర్లను వేసి నిత్యం పదుల సంఖ్యలో ట్యాంకర్లతో నీటిని అమ్ముకుంటూ అధికారులు కళ్లుగప్పి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద సంపులను ఏర్పాటు చేసి బోర్లతో పాటు చెరువులోని నీటిని సైతం లాగేస్తూ సంపుల్లో నీటి నిల్వ చేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 192లో పంతుల చెరువును అనుకొని వరుసగా 3 నీటి ప్లాంట్లు అనధికారంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి నీటి దందా నిర్వహిస్తూ సంబంధిత అధికారులకు సవాళ్లు విసురుతున్నారు.
~ ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ లోకి చొరబడి మరీ నీటి చోరీ….
చెరువు సరిహద్దును అనుకొని పక్కనే కొంత పట్టా స్థలం ఉంది. పట్టా స్థలం ఆధారంగా పక్కనే ఉన్న చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ స్థలాన్ని కూడా అందులో కలిపేసుకొని వారి సొంత జాగీరులా బోర్లు వేసి భూగర్భ జలాలను కొల్లగొడుతున్నారు. ప్రతీ రోజు ఒక్కో ప్లాంటు నుంచి సుమారు 10 నుంచి 15 ట్యాంకర్ల నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.1,800 కు విక్రయిస్తున్నారు.
~ ఫిల్టర్లు ఏర్పాటు చేసి… నీటిని శుద్ధి చేసి..
నీటి వ్యాపారానికి సంబంధించి సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు కానీ.. పత్రాలు కానీ లేకుండా నీటి దందాను దర్జాగా చేస్తున్నారు. అంతేకాకుండా బోర్లు, చెరువులోని నీటిని శుద్ధి చేసేందుకు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రత్యేకంగా ఫిల్టర్లతో శుద్ధీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరీ నీటిని విక్రయిస్తున్నారు. శుద్ధి చేసిన నీటిని ట్యాంకర్లతో రసాయన, ఔషధ (మెడిసిన్) తయారీ పరిశ్రమలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అనధికార నీటి ప్లాంట్లపై చర్యలు తీసుకొని సీజ్ చేస్తాం.
సూరారం గ్రామంలోని సర్వే నెంబర్ 192లోని నీటి ప్లాంట్లను పరిశీలించి అనధికారంగా నిర్వహిస్తున్నారని తెలితే వాటిపై చర్యలు తీసుకొని వెంటనే సీజ్ చేస్తాం. అనధికారంగా నిర్వహించే నీటి ప్లాంట్లపై ఎట్టి పరిస్థితితోనూ ఉపేక్షించేది లేదు. ఆ దిశగా తహసీల్దార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం.
– టి. శ్యాంప్రకాష్, రెవెన్యూ డివిజనల్ అధికారి, మల్కాజిగిరి డివిజన్