విజృంభిస్తున్న ‘గ్రామ సింహాలు’… భయాందోళనలో ప్రజలు
~ దుండిగల్ లో రెండేళ్ల చిన్నారిపై…
~ నిజాంపేట్ లో 14 ఏళ్ల బాలుడు పై వీధికి కుక్కల దాడి
~ తీవ్రంగా గాయపడిన చిన్నారి
~ పలు సంఘటనలు జరిగినా…పట్టింపు లేని అధికారులు
~ పట్టించుకోని ప్రజాప్రతినిధులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 8 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గ్రామ సింహాలు స్వైర విహారం చేస్తున్నాయి. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులపై వాటి ప్రతాపం చూపిస్తూ గాయపరుస్తున్నాయి. దీంతో ఇళ్లలోంచి అడుగు బయట పెట్టాలంటేనే ప్రజలు జంకుతున్నారు.
• రెండేళ్ల చిన్నారి, 14 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి.. దుండిగల్ మున్సిపల్ పరిధి 10వ వార్డ్ లో ఓ రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు శనివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అలాగే నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి జర్నలిస్ట్ కాలనీలో శనివారం సాయంత్రం సుమారు 5:30 గంటలకు టిఫిన్ తెచ్చుకోవడానికి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సాయి చరణ్ (14) అనే బాలుడిని వీధి కుక్కలు వెంటాడి మరీ కరిచి గాయపరిచాయి. గాయపడిన చిన్నారిని, బాలుడిని ఆయా ప్రాంతాల్లోని సమీప ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
• పలు సంఘటనలు జరిగినా… పలు ఫిర్యాదులు అందినా…
నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో గత నెల రోజుల్లో వీధి కుక్కల దాడి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయంపై బాధితులు, స్థానికులు పలు ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందించినప్పటికీ స్పందించే నాథుడే కరువయ్యాడని వారు వాపోతున్నారు. కుక్కల దాడులతో ప్రజలు బాధపడుతున్న.. మాకెందుకులే అన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనను చూసిన అధికారులకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ కనువిప్పు జరగడంలేదని ఆరోపిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కుక్కలను తీసుకుని వచ్చి నిజాంపేట్ డంపింగ్ యార్డ్ సమీపంలో విడిచిపెట్టడంతో అవి విధుల్లోకి చేరి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, వెటర్నరీ అధికారులు స్పందించి నిజాంపేట్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపల్ పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి వారిని తప్పించాలని ప్రజలు కోరుతున్నారు.