వివాదాస్పద స్థలంలో ఇరువర్గాల మధ్య మరోమారు వివాదం
~ నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి పరిస్థితి
~ ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు
~ గ్రామకంఠం భూమిని రిజిస్ట్రేషన్ స్థలంగా చూపుతున్నారని ఒక వర్గం ఆరోపణ
~ తమకు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని మరో వర్గం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 26 : కుత్బుల్లాపూర్ గ్రామం ప్రశాంత్ నగర్ లో ఓ వివాదాస్పద స్థల విషయంలో ఇరువురు వర్గాల మధ్య మరోసారి బుధవారం వివాదం నెలకొంది. వివాదం ‘నువ్వెంత… అంటే నువ్వెంత’ అనే స్థాయికి చేరుకుంది. ప్రశాంత్ నగర్ లో ఉండే రస్తపురం సత్యనారాయణ కుటుంబానికి గ్రామకంఠం పరిధిలో ఇంటి నెంబర్ 4-68లో 1066.55 చదరపు గజాల స్థలం ఉందని, ఆ స్థలం వంశపారంపర్యంగా వస్తుందని తెలిపారు.
సదరు స్థలానికి కుత్బుల్లాపూర్ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆస్తి పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. 2010లో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు సర్వే చేసి తమకు గ్రామకంఠం సర్టిఫికెట్ కూడా అందజేశారని అప్పటినుంచి సదరు స్థలం తమ ఆధీనంలోనే ఉందని పేర్కొన్నారు. అయితే 2020 సంవత్సరంలో కొంతమంది కబ్జాదారులు సదరు స్థలంలో భాగమైన 422.76 చదరపు గజాల తమ స్థలంపై కన్నేసి ఆక్రమించుకునేందుకు పూనుకున్నారని తెలిపారు. దీనిపై పోలీసు ఫిర్యాదు తో పాటు రెవెన్యూ, జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అలాగే జాతీయ ఎస్టి కమిషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో వారు జిల్లా కలెక్టర్ కు సర్వేకు నివేదించగా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారులు సర్వే, పంచనామా చేసి తమకే చెందుతుందని నివేదిక ఇచ్చారని సత్యనారాయణ తెలిపాడు.
దాని ప్రకారం సదరు స్థలాన్ని నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు చట్ట ప్రకారం విభజించుకొని 2019 పార్టిషన్ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నామన్నారు. అయితే ఈనెల 13వ తేదీన కర్రె కుమార్ అనే వ్యక్తి నకిలీ పత్రాలను చూపించి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో తనపై ఫిర్యాదు చేసినట్లుగా ఆయన తెలిపారు. అయితే కర్రె కుమార్ కొన్న స్థలం సర్వేనెంబర్ 4, 5లోని రిజిస్ట్రేషన్ స్థలమని, తమది గ్రామకంఠం స్థలం అని తెలిపారు. తమ స్థలాన్ని తాము కొన్న రిజిస్ట్రేషన్ స్థలంగా చూపించి కబ్జాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాత్రికి రాత్రే తమ స్థలంలో నిర్మాణ సామాగ్రిని వేసి, తమ స్థలంగా ధ్రువీకరిస్తూ ఎమ్మార్వో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఏర్పాటుచేసిన సూచిక బోర్డులను తొలగించి, ప్రహరీపై రెవెన్యూ యంత్రాంగం రాసిన ఆర్డర్ నెంబర్ ను కూడ చేరిపేశారని అన్నారు.
~ కూల్చిన ప్రహరీని పునర్నిర్మిస్తున్న మరో వర్గం…
సదరు స్థలానికి గతంలో ఉన్న ప్రహరీ గోడ కొంత భాగం తొలగించడంతో మరో వర్గం వారు ప్రహరీ పనులను మరల ప్రారంభించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ స్థలం తమదేనంటూ వారి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని, దానితోపాటు కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందని తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది.