సంక్షేమంలోనూ.. అభివృద్ధిలోనూ దేశానికే తెలంగాణ దిక్సూచి-హోం మంత్రి మహమూద్ అలీ
✓ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చేతులమీదుగా దుండిగల్ లో మూడవ విడత డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి..
✓ 19,020 లబ్దిదారులకు డబుల్ ఇల్లు అందజేత
✓ నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కని వారు ఎవరు నిరుత్సాహ పడొద్దు…
✓ రానున్న రోజుల్లో మిగతా విడతల్లో అర్హులైన వారందరికీ అవకాశం- ఎమ్మెల్యే వివేకానంద్
దుండిగల్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 2: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధి దుండిగల్ లో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి హోం మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై..ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు లతో కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను సోమవారం అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సకల సౌకర్యాలతో నిర్మించి దశలవారీగా అర్హులైన పేదలకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా పంపిణీ చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమం, అభివృద్ధిని సాధించి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రైవేటు అపార్ట్మెంట్లకు దీటుగా అన్ని హంగులతో నిర్మించి పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ… నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు దక్కని వారు ఎవరు నిరుత్సాహ పడొద్దని, రానున్న రోజుల్లో మిగతా విడతల్లో అర్హులైన వారందరికీ అవకాశం లభిస్తుందన్నారు.
మొదటి విడతలో నగర వ్యాప్తంగా 11,700 ఇళ్లను లబ్దిదారులకు అందించారు. రెండో విడతలో 13,300 ఇళ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నగరంలో ఇప్పటివరకు మొత్తం 44,020 ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించింది. కాగా సోమవారం 19,020 లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేస్తున్నాము అని ఎమ్మెల్యే తెలిపారు. ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. మొదటి, రెండు విడతల్లోనూ ఇదే పద్ధతి పాటించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్ మమతా,నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, దుండిగల్ కొంపల్లి మున్సిపాలిటీల చైర్మన్లు సుంకరి కృష్ణ వేణి, సన్నా శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్లు పద్మా రావు, గంగయ్య, వివిధ విభాగాల అధికారులు, కౌన్సిలర్ లు, కార్పొరేటర్ లు, మున్సిపల్ డివిజన్ ల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులూ, మహిళా నాయకులూ, లబ్ది దారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు