సర్వేనెంబర్ 348/1 లోని ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని మంత్రికి వినతి
~ పరికి చెరువుతో పాటు ప్రభుత్వ స్థలం అన్యాకాంతం అవుతుందని కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
~ పేద ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న బాలకృష్ణ
~ చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 18 : గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సర్వేనెంబర్ 348/1 లోని పరికి చెరువుతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతమవుతుందని స్థానిక కాంగ్రెస్ నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి మంగళవారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనే వ్యక్తి సుమారు రూ. 500 కోట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా అమాయకులైన పేద ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంత్రికి ఫిర్యాదు అందించిన వారిలో కాంగ్రెస్ జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షుడు గణేష్, కో-ఆర్డినేటర్ నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ చారీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి రెడ్డి, వేణు ఉన్నారు.
• గతంలోనూ పలు ఫిర్యాదులు… అయినా చర్యలు శూన్యం…
సర్వేనెంబర్ 348/1 లోని కబ్జాలు, భూ ఆక్రమణలపై గతంలో కూడా పలు ఫిర్యాదులు స్థానిక బిజెపి నాయకులతో పాటు పలువురు చేశారు. రాజీవ్ గృహకల్పలోని సంస్కృతి పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని బిఆర్ఎస్ నాయకుల అండదండలతో ఆక్రమించుకొని తాత్కాలిక డబ్బాలు, గదుల నిర్మాణాలు చేపడుతున్నారని నేటికి సరిగ్గా సంవత్సరం క్రితం (జూన్ 18 వ తేదీ, 2023) కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా రెవెన్యూ యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో నేటికీ కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక డబ్బాలను, గదులను పేదలకు విక్రయిస్తూ కోట్లు గడిస్తున్నారని అప్పట్లో అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.