సీపీ చర్యలు.. అక్రమార్కుల్లో గుబులు!*

*సీపీ చర్యలు.. అక్రమార్కుల్లో గుబులు!*

*ఫిర్యాదులపై వేగవంతంగా విచారణ*

*నెల వ్యవధిలో ఎనిమిది మందిపై వేటు*

*వరంగల్:* పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి.సాధారణ ప్రజలకు రక్షణ కల్పించాలి. చట్టం పరిధిలో పనిచేయాలి.కానీ పరిధి దాటితే ఊరుకునేది లేదని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ.రంగనాథ్‌ హెచ్చరిస్తున్నారు.అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా పెట్టారు. ఫిర్యాదులు వస్తే చాలు వేగంగా విచారణ చేయిస్తున్నారు.సీపీ చర్యలతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు.
కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా విధులు నిర్వర్తిస్తుంటారు.వారిదే పెత్తనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కమీషన్లు,ఆమ్యామ్యాల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్నారు.ఇలాంటి వారి భరతం పడుతున్నారు పోలీస్‌ కమిషనర్‌. అక్రమార్కుల గుండెల్లో రైలు పరుగెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు.ఇక్కడ పనిచేయలేమని గుర్తించిన కొందరు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. కమిషనరేట్‌లో ఉంటే ఏదో ఒకరోజు తమ వంతు వస్తుందని అవినీతి అధికారుల్లో గుబులు పట్టుకొంది.

*గతంలో ఎన్నడూ లేని విధంగా.*

గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతిపరులపై చర్యలు తీసుకోవడం కమిషనరేట్‌లో చర్చనీయాంశమైంది.నెల రోజుల వ్యవధిలో ఎనిమిది మందిపై వేటు పడింది. రాయితీ బియ్యం అక్రమ రవాణాకు సహకరించిన టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌తో పాటు ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు,ఒక కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా రాజీ కుదుర్చుకోవాలని హుకుం జారీచేసిన సుబేదారి ఎస్సైని సీపీ వదలిపెట్టలేదు.క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌, దామెర ఎస్సైలపై అదే పంథాను ప్రదర్శించారు. దొంగతనం కేసులో నిందితుడు ఠాణా నుంచి తప్పించుకున్నాడు.విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్నారు.ఇలా ప్రతి విషయంలో సీపీ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

*భూదందాలపై నిఘా*

నిత్యం జరిగే ప్రజావాణిలో భూఆక్రమణలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో భూదందాలపై సీపీ నిఘా పెట్టారు. కబ్జాదారులకు పోలీసులెవరైనా సహకరించినట్లు తెలిస్తే వెంటనే విధుల నుంచి తొలగిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. భూవివాదాల్లో తలదూర్చకుండా ఇరువర్గాలను పిలిచి నిజానిజాలు పరిశీలించి ఎస్‌వోపీ అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని, అవసరమైతే కేసులను నమోదు చేసి జైలుకు పంపిస్తామని కఠినంగా చెప్పారు.సెంట్రల్‌జోన్‌ పరిధిలోని రెండు ఠాణాల్లో ఎక్కువగా భూవివాదాలు జరుగుతున్నాయి.వీటిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More