సెల్ ఫోన్ చార్జర్ కోసం మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్టు
~ హత్య చేసి పరారైన నిందితుడు
~ గాగిల్లాపూర్ కూడలిలో అదుపులోకి
~ 48 గంటల్లోనే కేసు చేదించిన దుండిగల్ పోలీసులు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 26: మనిషి ప్రాణానికి ఏ మాత్రము విలువ ఇవ్వకుండా కేవలం తన సెల్ ఫోన్ చార్జర్ కనిపించడం లేదని, మద్యం మత్తులో మహిళను హతమార్చిన దుండగుడి ఉదంతం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దుండిగల్ తాండ-2లో ఈ నెల 22వ తేదీన హత్య గురైన ఒంటరి మహిళ జరుపుల శాంతి (45) మిస్టరీని దుండిగల్ పోలీసులు 48 గంటల్లో చేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి దుండిగల్ పీఎస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను సోమవారం వెల్లడించారు. వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా సుబేదారు హన్మకొండ, రెవెన్యూ కాలనీ నుంచి వలస వచ్చి దుండిగల్ తండా- 2లో నివాసం ఉంటూ రావుల కమల కుమార్ (37) ఆల్ట్రా క్లీన్ అనే పరిశ్రమలో సూపర్వైజర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 21వ తేదీన పరిశ్రమలో పని చేస్తున్న క్రమంలో తన సెల్ ఫోన్ చార్జర్ కనిపించకపోవడంతో ఆ విషయంలో తోటివారితో పాటు పరిశ్రమ యాజమాన్యంతో కూడా గొడవ పెట్టుకున్నాడు. అనంతరం మద్యం మత్తులో సుమారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో దారిలో ఉన్న ఓ కిరాణ దుకాణం వద్దకు వెళ్లి నిద్రలో ఉన్న దుకాణ నిర్వకురాలిని (శాంతి) లేపి సెల్ ఫోన్ చార్జర్ ఇవ్వమని అడిగాడు. దీంతో శాంతి నిందితుడిని వెళ్లిపోమని వారించినా వినకుండా మద్యం మత్తులో ఆమెను విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు నెట్టి వేశాడు. దీంతో ఆమె కింద పడడం వల్ల తల వెనక భాగంలో బలమైన గాయం అయ్యింది. దీంతో ఆమె గట్టిగా అరుస్తుండడంతో భయపడ్డ నిందితుడు శాంతి నోరు, ముక్కును ఊపిరి పోయే వరకు అదిమి పట్టడంతో ఆమె ప్రాణం వదిలింది. అక్కడ నుంచి పారిపోయిన నిందిడుతు ఈ నెల 25వ తేదీన సుమారు సాయంత్రం 4 గంటల సమయంలో గాగిల్లాపూర్ కూడలిలో అనుమానస్పదంగా తిరుగుతున్న నేపథ్యంలో సీసీ పుటేజీల ఆధారంగా దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి రెండు సెల్ ఫోన్లు, రక్షపు మరకలతో ఉన్న ఒక జత చెప్పులు, రెండు రైలు టికెట్లు స్వాధీనం చేసుకునట్లు డీసీపీ తెలిపారు. కేవలం 48 గంటల్లోనే కేసును చేధించిన ఏసీపీ బి. శ్రీనివాస్ రెడ్డి, సీఐ పి.సతీష్, డీఐ బి. సతీష్, ఎస్ఐలు టి. శంకర్. కె. రంజిత కుమార్ రెడ్డి, కానిస్టేబుళ్లు వెంకటయ్య, రంజిత్ కుమార్, హమీద్, ఎస్వోటీ టీం మహేందర్,
|శాంతికుమార్ ను డీసీపీ అభినందించారు.