హెచ్ఎంటీ పునర్ వ్యవస్థీకరణకు అధ్యయనం చేస్తున్నాం. – కేంద్ర మంత్రి కుమారస్వామి
✓ చింతల్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను సందర్శించిన మంత్రి
✓ దేశానికే తలమానికమైన పరిశ్రమ నేడు దీనస్థితిలో ఉందని వ్యాఖ్య
✓ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో ఆదే పరిస్థితి
✓ త్వరలోనే పునరుద్ధరిస్తామని హామీ
✓ హెచ్ఎంటీ భూకబ్జాలపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 12 : హెచ్ఎంటీ (హిందూస్థాన్ మెషిన్ టూల్స్) పరిశ్రమ దేశానికే తల మానికం అని, ప్రస్తుతం హెచ్ఎంటీ దీనస్థితిలో ఉందని, పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తామని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ. కుమారస్వామి అన్నారు. అన్ని హెచ్ఎంటీ శాఖల పరిశీలనలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని హెచ్ఎంటీ పరిశ్రమను ఆయన, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, హెచ్ఎంటీ సీఎండీ రాజేష్ కోహ్లి, స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి శుక్రవారం సందర్శించారు. బెంగుళూరులో 1953వ సంవత్సరంలో స్థాపించినప్పటి నుంచి అత్యుత్తమ ఉత్పత్తుల తయారీతో వెలుగొంది, దేశ వ్యాప్తంగా ఆరు శాఖలకు విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పించిందని మంత్రి కొనియాడారు. ఆటువంటి పరిశ్రమ ప్రస్తుతం నిస్తేజంగా మారి మూతపడే స్థితి చేరిందని, అందులో పని చేసే కార్మికులు, వారి కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్ఎంటీ శాఖల్లో ఊహించిన స్థాయిలో ఉత్పత్తి లేక దీనస్థితి రాజ్యమేలుతుందన్నారు. పరిశ్రమలో పని చేసే కొందరు ఉద్యోగులు, సిబ్బంది దీనస్థితిలో ఉన్న హెచ్ఎంటీని వృద్ధిలోకి తీసుకు రావడానికి సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఇప్పటికీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు.హెచ్ఎంటీ పరిశ్రమను పునర్ వ్యవస్థీకరణ కోసం అధికారుల నుంచి నివేదికలు తీసుకొని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని, దానికి కొంత సమయం కావాలని మంత్రి అన్నారు. హెచ్ఎంటీ భూకబ్జాలపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాటి పరిరక్షణ కోసం చర్చించామని, రక్షణ సిబ్బందికి సూచనలు చేశామని, త్వరలోనే వాటిని కూడా
నిర్మూలిస్తామని, కొన్ని భూవివాదాలు కోర్టు పరిధిలో ఉన్నాయన్నారు. అంతకు ముందు పరిశ్రమలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం పరిశ్రమలో కలియ తిరిగుతూ జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు యంత్రాల పనితీరును పరిశీలించారు. ఆనంతరం పరిపాలన విభాగ నాలుగవ అంతస్తులో అధికారులు, సిబ్బందితో సమాలోచన సమావేశాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి నిర్వహించారు.
• ఆపరిష్కృత కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ~ఎమ్మెల్యే వివేకానంద్
గత కొన్ని సంవత్సరాలుగా ఆపరిష్కృతంగా ఉన్న హెచ్ఎంటీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి అండగా నిలవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, కేంద్ర మంత్రి కుమారస్వామి. సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు విన్నవించారు. ఈ సందర్భంగా వారితో చర్చిస్తూ హెచ్ఎంటీ ఉద్యోగులకు 1992 నుంచి చెల్లించాల్సిన వివిధ రకాలను
బకాయిలను నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఉద్యోగ విరమణ సమయంలో సుమారు 600 మంది ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు అందక వారి కుటుంబాలు రోడ్డున పడి నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఉద్యోగులకు అందాల్సిన పీఎఫ్, ఈఎల్ నగదును వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగులకు 2019 నుంచి ఆందాల్సిన గ్రాట్యుటీ (పారితోషకం) ఇప్పటికీ అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఎంటీ ఉద్యోగులకు అందాల్సిన బకాయిలతో పాటు అన్ని సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే వారిని కోరారు. ఇదే విషయంపై హెచ్ఎంటి రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫోరం , వర్కర్స్ అండ్ స్టాప్ యూనియన్ సభ్యులు కేంద్రమంత్రికి వినతి పత్రం అందజేశారు.