ప్రాగా టూల్స్ అటవీ ప్రాంతం లో వ్యక్తి దారుణ హత్య
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 28: బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచశీల కాలనీ నిర్మానుష్య ప్రదేశంలో (ప్రాగా టూల్స్ సమీపంలో) ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బాలానగర్ సీఐ నరసింహారాజు తెలిపిన వివరాల ప్రకారం… తెల్లవారుజామున 4గంటల సమయంలో తమకు డయల్ 100 ద్వారా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని సమాచారం అందినని, సదరు సమాచారం ప్రకారం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించగా హత్యకు గురైంది రాజ్ కుమార్ (21) అని స్థానికులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన రాజ్ కుమార్ స్థానికంగా ఓ లేత్ మిషన్ వర్క్ షాప్ లో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రాజ్ కుమార్ ఒంటి పై గాయాలు ఉండడంతో పాటు పదునైన చువ్వతో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతాన్ని బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, సీఐ నర్సింహా రాజు పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్ స్కాడ్ తో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.