హైదరాబాద్ ఫిబ్రవరి 17: సుప్రసిద్ధ కాకతీయ కట్టడం రామప్ప రుద్రేశ్వరాలయానికి ఇటీవల యునెస్కో గుర్తింపు లభించింది. ఇదే కోవలో యునెస్కో Intangible cultural heritage విభాగం క్రింద అద్భుతమైన గిరిజన సాంస్కృతిక వేడుక అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. గిరిజనులు, గిరిజనేతరులు అసంఖ్యాకంగా హాజరయ్యే ఈ మేడారం జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండగగా ప్రకటించింది. తాడ్వాయి మండలానికి సమ్మక్క సారలమ్మ మండలంగా పునఃనామకరణం చేసింది. ఈ జాతరను జాతీయ పండగగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఎంతోకాలంగా కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.యునెస్కో గుర్తింపు లభిస్తే మేడారం జాతరను అధ్యయనం చేయడానికి, గిరిజన, ఆదివాసీ సంస్కృతిని తెలుసుకోవడానికి వివిధ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో ఇప్పటివరకు తొమ్మిది ఉత్సవాలకు Intangible cultural heritage విభాగంలో యునెస్కో గుర్తింపు లభించింది. అవి: కలకత్తా దుర్గా పూజ (2021), కుంభమేళా (2017), నౌరూజ్ (2016), యోగ (2014), రామ్ లీలా (2008), లద్ధాఖ్ బౌద్ధుల బుద్ధపూజ (2012), కేరళ ముడియేట్టు నృత్యం (2010) మొదలైనవి. ఈ తొమ్మిది సాంస్కృతిక ఉత్సవాలతో పోల్చితే యునెస్కో గుర్తింపు దక్కేందుకు మన మేడారం జాతరకు అన్ని అర్హతలున్నాయి.
చరిత్రను పరిశీలిస్తే, 800 సంవత్సరాల క్రితం అప్పటి కాకతీయ రాజులపై గిరిజన రాజులు తిరుగుబాటు చేశారు. ఆ నేపథ్యంలో జరిగిన యుద్ధంలో నేలకొరిగిన పడిగిద్ద రాజు, గోవిందరాజులు, జంపన్న సారలమ్మ, సమ్మక్కలను దేవతలుగా మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహించి కొలవడం సంప్రదాయకంగా వస్తోంది. ఈ మేడారం జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు సుప్రసిద్ధ సామాజికవేత్త హైమన్ డార్ఫ్ (1909–95) కూడా కృషిచేశారు. హన్మకొండ వేయిస్తంభాల గుడిలోని శాసనంలోనూ మేడారం ఆదివాసీ దేవతల ప్రస్తావన ఉంది.గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను, జానపదుల ఆచార వ్యవహారాలను మేడారం జాతర అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఏ విధమైన సౌఖ్యాలను ఆశించకుండా కేవలం సమ్మక్క, సారలమ్మ తల్లుల దర్శన భాగ్యం దక్కితే చాలనే లక్షలాది జానపదుల భక్తిపూర్వక ప్రపత్తులు మరే సాంస్కృతిక ఉత్సవంలోనూ అంతగా కనిపించవు. ఒక విధంగా చెప్పాలంటే, మేడారం వేడుక ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్‌గఢ్ నుంచి గుత్తికోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడాలు; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒడిషా నుంచి సవర ఆదివాసీలు ఈ జాతరకు పెద్దయెత్తున తరలివస్తారు.
మతాలు వేరైనా, దేశాలు వేరైనా, పద్ధతులు వేరైనా జాతరలు సహజంగా జరిగే వేడుకలు. అయితే ఏ జాతరకూ లేని ప్రత్యేకతలు, అన్ని జాతరల్లో కనిపించే విశిష్టతలు మేడారంలో కనిపిస్తాయి. గలగల పారే నదిలో పుణ్యస్నానాలు చేసే కుంభమేళా లాంటి దృశ్యాలు ఇక్కడా కనిపిస్తాయి. గణగణమోగే గంటలు హిందూ దేవాలయాలు, క్రైస్తవ చర్చిలో వాతావరణాన్ని ప్రతిధ్వనిస్తాయి. కొండకోనల మధ్య జనసందోహం శబరిమలను తలపిస్తుంది. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించే మరో తిరుమల ఇక్కడ ప్రత్యక్షమవుతుంది. దైవత్వం సంతరించుకున్న మానవత పుట్టిన మరో జెరూసలేం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, గుర్తించడం వరకు మాత్రమే మేడారం జాతర పరిమితం కాదు. నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం కూడా ఈ గిరిజన వేడుకలో అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తులయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం దేవుళ్ళు, దేవతలయ్యారు. ఇలా, ఇన్ని ప్రత్యేకతలు, విశిష్టతలు, విశేషాలు ఉన్న మేడారం జాతరకు యునెస్కో గుర్తింపు లభించవలసిన అవసరముంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సమగ్ర ప్రతిపాదనలను యునెస్కోకు పంపించాలి.