జలజగడాలకు స్వస్ధి చెప్పాలి:రఘు

పొరుగు రాష్ట్రమైన తెలంగాణ తో జలవివాదం పరిష్కరించుకోవడం మంచిదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోలేఖ రాశారు.  లేఖ పూర్తి పాఠం దిగువనిస్తున్నాం

జులై 2, 2021
శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
విషయం: తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం
సూచిక: నవ సూచనలు (వినమ్రతతో) లేఖ 4
ముఖ్యమంత్రి గారూ,
ఒక వ్యక్తిని ఎలాంటి షరతులు లేకుండా అమితంగా ప్రేమిస్తే ఆ వ్యక్తిలో ఏవైనా లోపాలు కనిపించినా మనం పెద్దగా పట్టించుకోము. మన మనసు దాని గురించి ఆలోచించదు.
2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా మీ చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తూ ఏం చెప్పారనే విషయాన్ని, భర్త, అత్తగారి ఇల్లు పేరుతో తెలంగాణకు వెళ్లి అక్కడ ఇప్పుడు ఏం చెబుతున్నారనే విషయాన్ని చూస్తే ఆమె యూ టర్న్ తీసుకున్నట్లు స్పష్టం అవుతున్నా మనం ఆ విషయం జోలికి వెళ్లవద్దు. దానిపై మనం పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే, తెలంగాణ రాష్ట్రం వాడుకుంటున్న నదీ జలాల విషయంలో మీరు తరచూ చెబుతున్న మాటలపై మాత్రం ఇరు రాష్ట్రాల ప్రజలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మే 14వ తేదీన నా పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ లోని నా నివాసంలో జరిగిన కీలక పరిణామాలు, పక్క రాష్ట్ర నాయకత్వంతో మీకు ఉన్న మంచి సంబంధాలను వెల్లడిస్తున్నది. మీ ఇద్దరి మధ్య చక్కని అవగాహన ఉన్నట్లు కూడా ఆ నాటి సంఘటనలు తరచి చూస్తే అర్ధం అవుతుంది.
మీరు పక్క రాష్ట్ర నాయకత్వాన్ని ఎంతో ప్రేమగా కౌగలించుకున్న ఆనాటి ఆ చిత్రం నా స్మృతి పథం నుంచి ఇంకా చెరగిపోలేదు. నేనే కాదు ఆనాటి ఆ సంఘటనను ఉభయ రాష్ట్రాలలోని ప్రజలు ఎవరూ కూడా ఈనాటికీ మర్చిపోలేదు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీలు మీకూ, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య ఉన్న సంబంధాలపై నిశిత విమర్శలు చేశాయి. అయితే వాటిని మీరు తీవ్రంగా ఖండించారు. పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలు ఉండటం వల్ల ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఇప్పటికి ఒక కొలిక్కి రాని విభజన చట్టంలోని సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి వీలుకలుగుతుందని కూడా మీరు ఆ నాడు చాలా గట్టిగా చెప్పారు. అదే విధంగా నదీ జలాల పంపిణీ వ్యవహారం కూడా పరిష్కారం అవుతుందని ప్రజలకు ఎంతో నమ్మకం కలిగించారు. తెలుగు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండడం వాంఛనీయమే. ఇదే 2019 సాధారణ ఎన్నికలలో మీరు అప్రతిహత విజయం సాధించడానికి కూడా ఉపకరించిందనేది నిర్వివాదాంశం. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పడం కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రజల బాగోగుల గురించి మీరు ఆలోచించడం చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో ఉండేవారికి నచ్చడం లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమావేశం అయి సమస్యలు పరష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం. అయితే మీరు ప్రధాన మంత్రికి లేఖలు రాయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రధానికి లేఖలు రాయడం అనేది సత్వర ఫలితాలను ఇవ్వదనే విషయం మీకు తెలిసి ఉండాలి.
కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 6 నుంచి 8 టిఎంసి (శతకోటి ఘనపుటడుగులు) నీటిని వాడుకోవడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పనులను ఆధునీకరించడంతో బాటు రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆఎల్ఐఎస్) చేపట్టేందుకు పనులు మంజూరు చేసే వరకూ అంతా బాగానే ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శైలం రిజర్వాయర్ ఆపరేషనల్ కంట్రోల్ మన వద్దే ఉండగా మీరు తెలంగాణ తో పోరాటం ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు. సమైక్యంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 811 టిఎంసి ల కృష్ణానదీ జలాలను కేటాయించిన విషయం మనకు అందరికి తెలుసు. ఇందులో విభజిత ఆంధ్రప్రదేశ్ కు 512 టిఎంసి, తెలంగాణకు 299 టిఎంసి నీటి వాటాలు కేటాయించిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మనం శైలం జలాలను ఆరు కరవు పీడిత జిల్లాలకు అందించాల్సి ఉండగా తెలంగాణ రెండు కరవు పీడిత జిల్లాలకే (మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండలో కొంత భాగం, రంగారెడ్డి జిల్లాలో కొంత భాగం) నీటిని అందించాల్సి ఉంది. శ్రీ శైలం రిజర్వాయర్ లో 800 అడుగుల ఎత్తుగానీ అంతకు తక్కువ గానీ ఉన్నా సరే తెలంగాణ తనకు కేటాయించిన 7 టిఎంసి నీటిని తీసుకోవడానికి వీలుకలుగుతుంది. మనం 881 అడుగుల కింద ఉన్న నీటిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకోలేము. మరి ఈ పరిస్థితుల్లో తెలంగాణ దిగువప్రాంతాలలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో బాగా అభివృద్ధి చెందిన ఐటి పరిశ్రమలతోనూ, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఔషధ రంగ పరిశ్రమల కారణంగానూ హైదరాబాద్ పరిసరాలు ఎంతో బాగా విస్తరించి అక్కడి ఆంధ్రా సెటిలర్లు కేసీఆర్ ప్రభుత్వంతో, అక్కడి పాలనా విధానాలతో ఎంతో సంతోషంగానే ఉన్నారని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. మీ భయాలకు విరుద్ధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడి ఆంధ్రా ప్రజలను చక్కగా చూసుకుంటున్నారు. ఆంధ్రా సెటిలర్లపై ఎలాంటి వివక్ష చూపించడం లేదు.
ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు సాయపడాలనుకుంటే, అది ఎంత కష్టమైనదైనా సరే ఏదోక విధంగా చేసేందుకు వీలుకల్పించుకుంటారు. మీరు పంచుకుంటున్న హార్దిక సంబంధాన్ని కొనసాగించేందుకు మీరు పోరాటం చేయడం కన్నా వారితో కూర్చుని మాట్లాడితే సరిపోతుందని నేను భావిస్తున్నాను. మనమేదో రాజకీయ లబ్ది కోసం మాత్రమే ఇలా తగవును నెత్తికెత్తుకుంటున్నామని కొందరు అనుకుంటుండగా మీరు దీన్ని సామరస్యంగా ఇప్పటికైనా పరిష్కరించుకోకపోతే దీన్ని ప్రజలు అందరూ సినిమా స్టంట్ అనుకోవడానికి కూడా వీలుంటుంది. ఈ సందర్భంగా ఒక విచిత్రమైన విషయాన్ని ఇక్కడ అందరూ తెలుసుకోవాలి. అదేమంటే రెండు రాష్ట్రాలలో నీటిపారుదల పనులను చేపట్టి ప్రాజెక్టులు నిర్మించే పెద్ద కంపెనీ ఒక్కటే.
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒక్కటే. మీరు ఇరు రాష్ట్రాల మధ్య నెలకొని ఉన్న నీటి తగాదాను ఇరు రాష్ట్రాల మధ్య చర్చలతో పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయండి. లేకపోతే కేంద్రం, వాటర్ ట్రిబ్యునల్స్ చెప్పేది వినండి. అంతే కానీ రాజకీయ అవసరాల కోసం దీన్ని పెంచి పెద్దది చేయవద్దు.
భవదీయుడు
కె.రఘురామకృష్ణంరాజు

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More