అప్రోచ్ రోడ్డు లేని ఆకృతి కన్స్ట్రక్షన్స్ అనుమతులను రద్దు చేయాలి
~ హెచ్ఎండిఏ లో ఫిర్యాదు చేసిన నిజాంపేట్ బిజెపి నాయకులు
~ ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు రోడ్డుగా చూపిన ఆకృతి
~ అధికారుల అండదండలతోనే అని ఆరోపణ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 14 : ప్రభుత్వ భూమిని ప్రైవేటు రోడ్డు స్థలంగా చూపిస్తూ అక్రమ అనుమతులు పొందిన ఆకృతి కన్స్ ట్రాక్షన్ అనుమతులను తక్షణమే రద్దుచేసి నిర్మాణాల పై చర్యలు తీసుకోవాలని హెచ్ఎండిఏ అధికారులకు బిజెపి నిజాంపేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ శుక్రవారం ఫిర్యాదు చేశారు.
బాచుపల్లి గ్రామంలోని సర్వేనెంబర్ 453/1,2 లో సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, 5 అంతస్తుల భవన నిర్మాణానికి ఆకృతి కన్స్ ట్రాక్షన్ అనుమతులను పొందింది. అయితే సరైన అప్రోచ్ రోడ్డు లేకుండా అక్రమ పద్ధతులలో అనుమతులు పొందారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాణ స్థలానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు కట్ట, సర్వేనెంబర్ 454 ప్రభుత్వ స్థలంలోని సుమారు 300 గజాలను ఆక్రమించుకొని రేకుల షెడ్డు నిర్మించి, అప్రోచ్ రోడ్డుగా చూపించడమే కాకుండా నిర్మాణ స్థలంలో నుంచి వెళ్లే చెరువు నాలా ను సైతం అనుమతుల కోసం మార్చారని ఆరోపించారు. హెచ్ఎండిఏ జెపివో సుధీర్ స్థల పరిశీలన చేసి కూడా తప్పుడు నివేదిక ఇవ్వడం వల్లనే అనుమతులు వచ్చాయన్నారు. ఇదే విషయంపై బిజెపి జిల్లా కలెక్టర్ కు, హెచ్ఎండిఏ అధికారులకు ఫిర్యాదు చేయగా నివేదికను అందించాలని స్థానిక ఎమ్మార్వోకు రెండుసార్లు ఆదేశించిన సర్వే చేసి కూడా సంవత్సర కాలం పాటు కాలయాపన చేసి ఎటువంటి నివేదికను అందించలేదన్నారు. హెచ్ఎండిఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల అండదండలతోనే ఆకృతి కన్స్ ట్రాక్షన్ దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతుందని ఆరోపించారు. దీనివల్ల ప్లాట్లు కొన్న వారు భవిష్యత్తులో అప్రోచ్ రోడ్డు లేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.