ఆలోచన ఘనం….ఆచరణ శూన్యం….
> ఆస్తిపన్నులో నగదు చెల్లింపులకు స్వస్తి
> డిజిటల్ పద్ధతిలోనే చెల్లింపులకు శ్రీకారం…
> చెక్కులు, డీడీలు యథాతదంగా స్వీకరణ
> సి ఎస్ సి ల్లో కనిపించని స్వైపింగ్ యంత్రాలు, క్యూఆర్ కోడ్లు, యూపీఐలు
> ఇబ్బందులు పడ్డ వినియోగదారులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 10: జీహెచ్ఎంసీలో ఆస్తి పన్ను చెల్లింపుల్లో నగదుకు సోమవారం నుంచి స్వస్తి పలికి నగదు రహిత చెల్లింపులకు నాంది పలికారు. ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వుల జారీ మేరకు జూన్ 10వ తేదీ నుంచి నగదు రహిత ఆస్తిపన్ను చెల్లింపుల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇప్పటి వరకు బిల్ కలెక్టర్లు, పౌర సేవా కేంద్రాలు (సీ ఎస్ సీ లు), మీ సేవా కేంద్రాల్లో నగదుతో ఆస్తిపన్ను చెల్లించే సౌలభ్యం అందుబాటులో ఉండేది. ఇకపై డెబిట్, క్రెడిట్ కార్డులు, క్యూఆర్ కోడ్, యూపీఐతో పాటు ఇతర్రాత పద్దతిలో డిజిటల్, ఆన్లైన్ చెల్లింపులకు మాత్రమే అవకాశం కల్పించారు.
అవకతవకల నేపథ్యంలోనేనా…?
ఆస్తి పన్ను చెల్లింపుల్లో వసూళ్లు చేసుకున్న నగదు విషయంలో అధికారులు, సిబ్బంది అవకతవకలకు పాల్పడుతున్నారే సంఘటనలతో నగదు రహిత చెల్లింపులకు స్వీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది. డిజిటల్, ఆన్లైన్ చెల్లింపుల వల్ల ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదని, చెల్లింపులు నేరుగా జీహెచ్ఎంసీ ఖాతాలో జమవుతాయనే ఉద్దేశ్యం మంచిదే. అయినప్పటికీ ఆచరణలో మాత్రం ఆ మేర ఏర్పాటు కనబడడం లేదు.
అలోచన మంచిదే..ప్రత్యామ్యాయం ఎక్కడ..?
పన్ను చెల్లింపులో నగదును ఇకపై స్వీకరించమని తెలిపిన ఉన్నతాధికారులు వాటికి ప్రత్యామ్యాయంగా డిజిటల్ చెల్లింపుల కోసం అవసరమైన స్వైపింగ్ యంత్రాలు గానీ, క్యూఆర్ కోడ్లు గానీ, యూవీఐలు గానీ, సీ ఎస్ సీ కేంద్రాల్లో ఏర్పాటు చేయకపోవడం వారి నిబద్ధతకు నిదర్శంగా నిలుస్తుంది. ముందుగా డిజిటల్ చెల్లిపుంటకు కావల్సిన వాటిని సమకూర్చకుండా నగదు రహిత చెల్లింపుకు నాంది పలకడంతో అధికారుల తీరుపై ఇటు సిబ్బందితో పాటు అటు వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. అలోచన సరే కానీ ఆచరణ ఎక్కడ..? అని ప్రశ్నిస్తున్నారు. చెల్లింపుల కోసం డిజిటల్ యంత్రాలు లేకపోవడంతో సోమవారం కేవలం
చెక్కులు, డీడీలను మాత్రమే సీ ఎస్ సీల్లో తీసుకోవల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సోమవారం పలు సీ ఎస్ సీలు
వెలవెలబోయాయి.
నగదు రహితం… లాభమా.. నష్టమా…? పన్ను వసూళ్లలో నగదు రహితంతో అవకతవకలకు అడ్డుకట్ట పడడం ఓ పక్క శుభ పరిణామమే. అయినా.. నగదు రహిత చెల్లింపులు వల్ల దాని ప్రభావం వసూళ్లపై పడే అవకాశం ఉందని, తద్వారా వసూళ్లు తగ్గి లక్ష్యాల చేధనలో కష్టతరంగా మారుతుందని రెవెన్యూ అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. దీంతో జీహెచ్ఎంసీకి లాభమా.. నష్టమా..? అనే ప్రశ్న వారిలో ఉత్పన్నమవుతుంది.
నగదు లేక తగ్గిన చెల్లింపులు..
సోమవారం నుంచి ఆస్తిపన్ను చెల్లింపులు నగదు రహితం కావడం వల్ల కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల
కార్యాలయ సీ ఎస్ సీ ల్లో వరుసగా కుత్బుల్లాపూర్ కు రూ.27 వేలు, గాజులరామారంకు రూ. 3000 వసూలయ్యాయి. అదే సాధారణంగా నగదు చెల్లింపులు కూడా స్వీకరిస్తే రోజుకు సరాసరిన కుత్బుల్లాపూర్ కు సుమారు రూ. 45 వేలు, గాజులరామారం కు సుమారు రూ. 40వేలు ఆస్తి పన్ను వసూలు అయ్యేదని సమాచారం.