ఇల్లు మేమే కట్టిస్తాం… పేదింటి ఆడపిల్లల పెళ్లి మేమే చేస్తాం..-మంత్రి కేటీఆర్
~ దుండిగల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రారంభించి, పంపిణీ చేసిన మంత్రి.
~ మన పర భేదం లేకుండా పారదర్శకంగా పంపిణీ
~ ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు పది లక్షలు ఖర్చు
~ మార్కెట్లో వాటి విలువ రూ. 30 నుంచి రూ. 35 లక్షలు
~ 9 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బీఆర్ఎస్
~ హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ ను ఆశీర్వదించండి.
దుండిగల్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 21: ఎంతో బాధ్యత, కష్టంతో కూడుకున్న ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అన్న పెద్దల మాటను సీఎం కేసీఆర్ తెలంగాణ పేద ప్రజల కోసం సార్ధకం చేస్తున్నారని, ఇల్లు మేమే కట్టిస్తాం… పేదింటి ఆడబిడ్డల పెళ్లి మేమే చేస్తాం.. అని సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ గృహప్రవేశ పూజలు నిర్వహించి గురువారం ప్రారంభించారు. అనంతరం రెండో విడతలో ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల సభలో పాల్గొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పట్టాలను పంపిణీ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన 500 మంది లబ్ధిదారులకు, కూకట్పల్లి నియోజకవర్గంలోని 500 మందికి, సనత్ నగర్ నియోజకవర్గం లోని 500 మందికి, కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన 300 మందికి కలిపి మొత్తం 1,800 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లను రెండో విడతలో భాగంగా దుండిగల్ లో పంపిణీ చేశారు.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యం…
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు మన చేస్తుందని కేటీఆర్ అన్నారు. దీనిలో భాగంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి వేలకోట్లను వెచ్చించి ఇల్లు నిర్మించి పేదలకు అందజేస్తుందన్నారు.
అత్యంత పారదర్శకంగా ఇళ్ల పంపిణీ ప్రక్రియ…
నగరవ్యాప్తంగా లక్ష డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించామని, జిహెచ్ఎంసి ఒక్కో డబుల్ బెడ్ రూమ్ కు సుమారు రూ. 10 లక్షలు ఖర్చు చేసి మొత్తం రూ. 9700 కోట్ల నిధులను వెచ్చించిందన్నారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లక్ష ఇళ్లకు సుమారు రూ. 50 వేల కోట్ల నుంచి రూ. 60 వేల విలువ చేసే ఆస్తిని పేదల చేతిలోంచి ఒక్క చిల్లి గవ్వ కూడా ఖర్చు లేకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తున్నారు. అలాగే దుండిగల్ లో 4000 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామని ఒక్కొక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విలువ సుమారు రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకు పలికే అవకాశం ఉందని తెలిపారు. ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి లంచం కానీ, లాలూచీలు కానీ, సిఫార్సులు కానీ, ప్రజాప్రతినిధుల జోక్యం గాని లేకుండా అత్యంత పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పంపిణి జరుగుతుందని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ కోసం ఎన్ఐసి తో సంయుక్తంగా ప్రత్యేక సాప్ట్ వేర్ రూపొందించి రాండమైజేషన్ ద్వారా కంప్యూటర్లో లాటరీ పద్ధతితో జిల్లా యంత్రాంగం కేటాయింపులను నిర్వహిస్తుంది. దివ్యాంగులకు గ్రౌండ్, మొదటి అంతస్తులో కేటాయింపులు జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఇంత చక్కటి విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్న అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
పార్టీలకు అతీతంగా డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు…
డబుల్ బెడ్ రూమ్ ల కేటాయింపులు పారదర్శకంగా చేస్తున్నామని కేటీఆర్ ఉదహరిస్తూ గాజులరామారం సర్కిల్ జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్యకు, అదే డివిజన్ కు చెందిన బిజెపి నాయకురాలు సునీతకు ఈనెల రెండవ తేదీన నిర్వహించిన మొదటి విడత లోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు కావడం అందుకు నిదర్శనం అని తెలిపారు. నగర వ్యాప్తంగా రెండో విడతలో దాదాపు 8 చోట్ల 13,300 డబుల్ ఇళ్లను ఎటువంటి పక్షపాతం లేకుండా మన పర భేదం లేకుండా కేవలం ఇల్లు లేకపోవడమే గీటురాయిగా పెట్టుకొని కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా మొదటి విడతలో 11,700 ఇల్లును పంపిణీ చేశామని దీంతో ఇప్పటివరకు 25 వేల ఇల్లు పంపిణీ జరిగిందన్నారు. ఇంకా మిగిలి ఉన్న ఇళ్లను నెల, నెలన్నర లోపు ఇంతే పారదర్శకంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరికి కూడా ఒక్క పైసా లంచం ఇవ్వొద్దని, ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఏ ప్రభుత్వమైనా నిర్మించి ఉంటే మాకు చూపింస్తే తరిస్తాం…
టిఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో మంచినీటి, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులతో పాటు శాంతిభద్రతలను మెరుగుపరుచుకున్నామని, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి కల్పనలో ఈనాడు దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. నగరం శరవేగంగా బహుముఖంగా విస్తరిస్తుందని తెలిపారు. భారతదేశంలో తెలంగాణ కాకుండా ఉన్న 27 రాష్ట్రాలలో ఇంత అద్భుతమైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఏ ప్రభుత్వమైనా నిర్మించి ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. 560 చదరపు అడుగులలో రెండు పడక గదులు, రెండు మరుగుదొడ్లు, హాలు, వంటగది తో కూడిన ఇళ్లను కాంగ్రెస్ పార్టీ కానీ, బిజెపి కానీ ఎక్కడైనా ఇస్తే చూపించాలని వాటిని చూసి తరిస్తామని ఎద్దేవా చేశారు.
ఓర్వలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయి….
దేశంలో ఏ నగరంలో కూడా ఏ ప్రభుత్వము తలపెట్టలేని పెద్ద ఎత్తున మురికివాడలు, బస్తీల పునరాభివృద్ధి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టి అమలు చేస్తుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ లో పంపిణీ చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఉన్న దరఖాస్తుదారులు అర్హులు సుమారు 3.5 లక్షల మంది ఉన్న మాట వాస్తవమేనని, వారందరికీ ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దేశంతో పాటు రాష్ట్రంలో కూడా కరోనా లాంటి సంక్షోభం తో ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయని, అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు రెండుసార్లు రైతు రుణమాఫీ చేశామని , రైతు బంధు పథకం కింద 73 వేల కోట్ల రూపాయలను 70 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశామని, దళిత బంధు వంటి విప్లవత్మకమైన పథకం తెచ్చి దేశంలోనే దలితోద్ధరణలో ఆదర్శంగా నిలిచామన్నారు. పారిశ్రామికీకరణ నూతన పరిశ్రమల ఏర్పాటులో భాగంగా దుండిగల్ లో కూడా నూతన పరిశ్రమను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు వస్తారు…
గత పాలకులు ప్రజలకు ఏం చేశారో చెప్పలేక ప్రస్తుతం పనితో గెలవలేక ఇష్టం వచ్చిన హామీలను ఇస్తూ కొత్త కొత్త రూపాల్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నరు. ఎక్కడో ఢిల్లీ నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఇచ్చే బూటకపు హామీలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలు పార్టీల వైపు ఉందామా… ప్రజల పక్షాన నిలబడే టిఆర్ఎస్ వైపు నిలబడదామా ఆలోచించుకోవాలని కోరారు. అన్ని రంగాల్లో సకల వసతులతో చేస్తున్న అభివృద్ధి ప్రగతి రథచక్రాన్ని ఆపడానికి సంక్రాంతి ముందు గంగిరెద్దుల వాళ్లు వచ్చినట్లు ఎన్నికల ముందు మాత్రమే వచ్చి ఇచ్చే హామీలకు మోసపోవద్దని విమర్శించారు. తన తన బేధం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్న సీఎం కేసీఆర్ ను మరో మారు ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ కోరారు.
అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నామని, నియోజకవర్గం పరిధిలోని అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా డబల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కలెక్టర్లు అనుదీప్ అమోయ్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, వివిధ శాఖల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు