ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నీట మునిగినన కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్ (విధాత్రి), సెప్టెంబర్ 6 : ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టి వర్షానికి కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లోని ప్రధాన, అంతర్గత రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లల్లోకి వర్షం నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. కాకతీయ నగర్ , వెంకన్న హిల్స్, శివారెడ్డి నగర్, సాయి నగర్ , శ్రీనివాస్ నగర్, ప్రసూన నగర్, వెంకటేశ్వర నగర్, మాణిక్య నగర్, పాపయ్య యాదవ్ నగర్, ఇంద్ర సింగ్ నగర్ , గణేష్ నగర్, వెంకన్న హిల్స్, ఫస్ట్ వెన్యూ, భూమిరెడ్డి కాలనీ, తదితర ప్రాంతాలలో వరద నీరు రోడ్లపై పోటెత్తింది. చింతల్ వెళ్లే ప్రధాన రహదారి కాకతీయ నగర్ నూతన బ్రిడ్జి సమీపంలో రోడ్డుపై వరద నీరు నిలవడంతో జిహెచ్ఎంసి సిబ్బంది రాకపోకలను బంద్ చేశారు. మాణిక్య నగర్ నుండి గణేష్ నగర్ మీదుగా చింతల్ వెళ్లే ప్రధాన రహదారి ప్రణవ్ స్కూల్ సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కుత్బుల్లాపూర్ డివిజన్ వాజ్పేయి నగర్ లో ప్రతి వీధిలో వరద నీరు నడుము లోతుకు చేరింది. కొన్ని ఇళ్లలోకి వరద ప్రవాహం రావడంతో బాధితులు బంధువుల ఇళ్లలో తల దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ వరద ప్రవాహానికి ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం చెల్లాచెదరై నీటిలో కొట్టుకుపోయాయని బాధితులు ఆవేదన చెందారు. వాజ్పేయి నగర్ లో నూకరాజు, రమణమ్మ ఇంటి స్లాబు పెచ్చులు ఊడడంతో భయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీశారు. అంతేకాకుండా కోటయ్య అనే వ్యక్తి ఇల్లు కుండపోత వర్షానికి పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో బాధితులు బిక్కుబిక్కుమంటూ రోడ్డుపైనే గడపాల్సిన దుస్థితి వచ్చింది. సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు.
ఇళ్ళ ముందు పెట్టిన ద్విచక్ర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు. వాజ్పేయి నగర్ లో ఇటీవల వేసిన ప్రధాన రహదారి సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడంతో గల్లీలలో రోడ్లపై నీరు నిలిచిపోయి ఇళ్లలోకి చేరుతుందని స్థానిక వాసులు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎంత పెద్ద వర్షం వచ్చిన వర్షపు నీరు సాఫీగా వెళ్లిపోయేదని ప్రధాన రోడ్డు ఎత్తు అవడంతో వరద నీరు గల్లీలలోనే నిలిచిపోతుందని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి వాజ్పేయి నగర్ లగల్లీలలో కూడా రోడ్లు వేయాలని అధికారులను కోరారు.