ఎస్ టీ పీ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధం చేస్తున్న అధికారులు

• సీఎం రానున్న నేపథ్యంలో ఆగమేఘాలపై…
• వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పనుల నిర్వహణ
• ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం… పనులకు కలుగుతున్న ఆటంకం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 25:  జల మండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి) ప్రతిష్టాత్మకంగా తీసుకుని మురుగు నీటిని శుద్ధి చేసి కలుషిత భూగర్భ జలాల నివారణ, చెరువుల శుద్ధికరణే లక్ష్యంగా కోట్ల రూపాయల వ్యయంతో అధికారులు ఎస్ టీ పీ (మురుగు శుద్ధీకరణ కేంద్రం)ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఎస్ ఎన్ డీ పీ (వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్ట్)లో భాగంగా చెరువులు, కుంటల వద్ద ఎస్ టీ పీల ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఎస్ టీ పీ ల ఏర్పాటు వల్ల చెరువులు, కుంటల్లోని నీటిలో ఆక్సిజన్ శాతం పెరిగి, మత్స్య సాగుకు అనువుగా మారుతుంది. అలాగే చెరువులను సుందరీకరించేందుకు సులభతరం కావడంతో, పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్ధేందుకు అవకాశం ఉంటుందని, చెరువుల నుంచి దుర్వాసనలు వెదజల్లకుండా పరిసర ప్రాంతాల ప్రజలు దోమల వల్ల వ్యాపించే మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, ఫైలేరియా, మెదడు వాపు వంటి వ్యాధులు ప్రభలకుండా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఎస్ టి పి వద్ద జరుగుతున్న పనులు

✓ రూ. 21.87 కోట్లతో వెన్నెలగడ్డలో 10 ఎంఎల్డీ….
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి జీడిమెట్ల డివిజన్ లోని వెన్నెలగడ్డ ఎన్నా చెరువు వద్ద రూ. 21.87 కోట్ల వ్యయంతో 10 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని (ఎస్ టీ పీ) ఏర్పాటు చేసి ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఎన్నా
చెరువులోకి జొన్నబండ, పేట్ బషీరాబాద్ లోని ప్రధాన మురుగు నీటి డ్రైనేజీ వ్యవస్థ, నాలాల ద్వారా మురుగు చేరుతుంది. ఎస్ టీ పీ నిర్మాణంతో సదరు మురుగు నీరు మొదటగా ఎస్ టీ పీ లోకి చేరుతుంది. అక్కడ శుద్ధీకరణ చేసిన అనంతరం చెరువులోకి విడుదల చేస్తారు. రోజుకు 10 ఎంఎల్డీ శుద్దీకరణ నీరు చేరుతుండడంతో క్రమేణా చెరువులోని మురుగునీరు తగ్గుతూ… కొన్ని నెలలకు శుద్దీకరణ నీటితో నిండుతుందని ఓ అధికారి తెలిపారు.

మురుగునీరు శుద్దీకరణ జరిగే ప్రాంతం

✓శుద్ధీకరణకు ముందు… అనంతరం నీటిలోని ప్రమాణాలు…
నేరుగా ఎస్ టీ పీ లోకి వచ్చే మురుగు నీటిలో 7 నుంచి 8 పీహెచ్ (హైడ్రోజన్ సంభావ్యత) ప్రమాణంగా ఉండగా దాని విలువ శుద్ధీకరణ అనంతరం 6 నుంచి 8 పీహెచ్ కు చేరనుంది. అలాగే బయో రసాయన ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) ప్రమాణం 250 పీపీఎం నుంచి 10 పీపీఎంకు,
రసాయన ఆక్సిజన్ డిమాండ్ (సీవోడీ) ప్రమాణం 425 పీపీఎం నుంచి 50 పీపీఎంకు చేరనుంది. నీటిలో మొత్తం తొలగించబడ్డ ఘన పదార్థాలు (టీఎస్ఎస్) ప్రమాణం 375 పీపీఎం నుంచి 10 పీపీఎంకు చేరనుంది.

వర్షంలోనే నిర్మిస్తున్న సిసి రోడ్డు

✓ వర్షంలోనే పనులు…మైకా కవర్ తో కవరింగ్…
వెన్నెలగడ్డ చెరువు వద్ద నిర్మిస్తున్న ఎస్ టీ పీ ని ఈ నెల 27వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారనే సమాచారంతో అటు జలమండలి అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటు పలు విభాగాల అధికారులు ఆగమేఘాలపై పనులు పూర్తి చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి కాట కూడా సంబంధిత అధికారులతో కలిసి వచ్చి పనుల తీరును పరిశీలించారు. అయితే.. ప్రస్తుత అక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎస్ టీ పీ లో ఇంకా మిగిలి ఉన్న పనులకు తుది మెరుగులు
దిద్దుతుంటే.. మరో పక్క సీఎం వచ్చే దారిలోని రహదారులు గుంతలమయంగా ఉండడంతో పాటు ఎస్ టీ పీ వద్ద నూతన రహదారి నిర్మాణాన్ని యుద్ధ ప్రతిపదికన జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టారు. అయితే…ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పనులకు ఆటంకం కలుగుతున్నా… బలవంతంగా రహదారులను లాక్కొస్తున్నారు అధికారులు. కురుస్తున్న వర్షాలకు గొడుగుల చాటున అధికారులు సీసీ రోడ్డును నిర్మిస్తూ మైకా కవర్ లతో రహదారిని కవర్ చేస్తున్నారు.

✓ ప్రారంభోత్సవం ఉన్నట్లా… లేనట్లా…?
ఎస్ టీ పీ వద్ద నెలకొన్న పరిస్థితులు, ప్రారంభోత్సవానికి సీఎం రాకపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఈ నెల 27న జరగనున్న ప్రారంభోత్సవం ఉన్నట్లా.. లేనట్లా..? అని సంబంధిత అధికారులు సైతం అమోమయంలో ఉన్నారు. శుక్రవారం నాటికి అందే సమాచారం కోసం వారు కూడా వేచి చూసే ధోరణిలోనే కనిపించారు. ఇప్పటికే సీఎం వచ్చే దారిలో రహదారులకు ఇరువైపులా ఉన్న తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలను ఆల్వాల్ ట్రాఫిక్ పోలీసులు తొలగించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More