గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలి. -మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి
~ మండప నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి
~ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి
~ నిబంధనలకు అనుగుణంగానే ఏర్పాట్లు ఉండాలి
~ అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలి
~ పండుగల నిర్వహణ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 27 : గణేష్ ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, శాంతి భద్రతలకు విగాథం కలిగించకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి సూచించారు. రానున్న వినాయక చవితి పండుగ దృష్ట్యా మేడ్చల్ జోన్ పరిధిలోని పోలీసులు, ట్రాఫిక్, జిహెచ్ఎంసి, మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బందితో పాటు గణేష్ మండప నిర్వాహకులతో పెట్ బషీరాబాద్ లోని ఎస్ పి జి గ్రాండ్ లో డిసిపి సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరగనున్న గణేష్ ఉత్సవాలకు మండప నిర్వాకులు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటు సంబంధిత శాఖల అనుమతులను పొందాలని తెలిపారు.
ప్రతి పండగలకు, ఉత్సవాలకు, ఊరేగింపులకు, శోభాయాత్రలకు పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అలాగే మండప నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరిస్తూ సమన్వయంతో ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా నిర్వహించుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను ఆయా చెరువుల వద్ద సంబంధిత శాఖల అధికారులు కల్పిస్తున్నారని వాటిని ఉపయోగించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలను అర్ధరాత్రి వరకు నిర్వహించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా సాధ్యమైనంత త్వరగా ముగించాలని డిసిపి సూచించారు. అలాగే శోభాయాత్రలో కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల ఏర్పాట్లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లతోపాటు ఇతరాత్రా విషయాల్లో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిబంధనలకు అనుగుణంగానే సౌండ్ బాక్స్ లు, సౌండ్ సిస్టం లను ఏర్పాటు చేయాలని తెలిపారు. పండుగలను సంస్కృతి, సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించుకుంటూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలని సూచించారు. విగ్రహాల నిమజ్జన సమయంలో చెరువుల వద్ద వాహనాల వరస పద్ధతిని పాటించి అధికారుల సూచనల మేరకు నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మండప నిర్వహకులతో సమావేశాలను ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వీలును బట్టి ప్రతి మండపం వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనానికి ఫిట్ నెస్ ఉన్న వాహనాలను, అనుభవం కలిగిన డ్రైవర్లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. ఇప్పటికే మేడ్చల్ పరిధిలోని చెరువులను పరిశీలించామని, నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నామని డిసిపి అన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకున్న వెంటనే స్థానిక పోలీసులకు కానీ, సంబంధిత అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు డిసిపి పురుషోత్తం, ఏసీపీలు రాములు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ వి. నరసింహ, మున్సిపల్ కమిషనర్లు సత్యనారాయణ, శ్రీహరి, స్వామి, దుండిగల్ తహసిల్దార్ మతిన్, సిఐలు విజయవర్ధన్, భరత్ కుమార్, సతీష్, శ్రీనాథ్, రాహుల్ దేవ్, యాదయ్య, సత్యనారాయణ, ఎస్సైలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, సిబ్బంది, గణేష్ మండప నిర్వాహకులు పాల్గొన్నారు.