తండ్రి మరణ వార్త విని ఇంటికి తిరిగి వచ్చిన తనయుడు
• ఇంటా…బయటా వేధింపులు తాళలేకే ఇళ్లు వదిలి వెళ్లానన్న రైతు మాధవరెడ్డి
• నర్సాపురంలోని కొల్చారం, కౌడిపల్లి ప్రాంతాల్లో తిరుగుతుండగా…
• తండ్రి మరణ వార్త విన్న తనయుడు
• హుటాహుటిన ఇంటికి తిరిగి వచ్చిన రైతు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 11: భూబకానురుల వేధింపులు తాళలేక తనయుడు లేఖ రాసి ఆదృశ్యమవ్వగా, తనయుడి కోసం బెంగ పెట్టుకొని తండ్రి గుండెపోటుతో
మరణించిన విషయం విధితమే. బౌరంపేటకు చెందిన వంపుగూడెం మాధవరెడ్డి రైతుకు దొమ్మర పోచంపల్లిలోని సర్వే నెంబర్ 188లో తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.13 ఎకరాల స్థలం ఉంది. దీనిని తమకు అమ్మాలని పక్కనే ఉన్న త్రిపుర ల్యాండ్ మార్కు నిర్మాణ సంస్థ అడగగా, రైతు దానికి నిరాకరించడంతో అప్పటి నుంచి కక్ష కట్టి రైతుకు చెందిన భూమిని దౌర్జన్యంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. త్రిపుర ల్యాండ్ మార్కు యజమాని పసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం తమ పలుకుబడిని ఉపయోగించి రైతు మాధవరెడ్డిని నానా విధాల ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా మాధవరెడ్డి బంధువులలో పలువురిని తమ వైపుకు తిప్పుకొని భూమిని ఆమ్మేయాలనే ప్రతిపాదనలు కూడా తీసుకు వచ్చి ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. దీంతో ఇంటా… బయటా… ఒత్తిడిని తట్టుకోలేక అయోమయంతో తీవ్ర మనస్తాపానికి గురై దుండిగల్ సీఐ శంకరయ్యకు త్రిపుర ల్యాండ్ మార్కు, కార్పొరేటర్ వేధింపులు తాళలేక తాను ఇళ్లు వదిలి పెట్టి వెళ్లిపోతున్నానని, తన కుటుంబ సభ్యులను రక్షించాలని లేఖలో రాసి మంగళవారం ఆదృశ్యమయ్యాడు. తనయుడు ఆదృశ్యం కావడంతో మనో వేదన చెందిన మాధవరెడ్డి తండ్రి వంపుగూడెం కృష్ణారెడ్డి గుండెపోటుతో బుధవారం మరణించాడు.
తండ్రి మరణ వార్త విని ఇంటికి…
కృష్ణారెడ్డి మరణ వార్త సామాజిక మాధ్యమాలతో పాటు పలు మీడియా చానెళ్లలో వైరల్ అయ్యింది. నర్సాపురం ప్రాంతంలోని కొల్చారం, కౌడిపల్లిలో తిరుగుతుండగా ఆ
నోటా…ఈ నోటా తండ్రి మరణ వార్త మాధవరెడ్డి చెవిన పడగా హుటాహుటిన ఇంటికి తిరిగి వచ్చాడు.
రైతు కృష్ణారెడ్డి మృతికి కారణమైన కబ్జాదారులను కఠినంగా శిక్షించాలి. – సిపిఐ
సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ తో కలిసి సీపీఐ నాయకులు భౌరంపేటలోని రైతు మాధవరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యంగా ఉండి సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ తమకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసాను గురువారం వారు ఇచ్చారు. ఆనంతరం భౌరంపేట కమాన్ వద్ద వారు మాట్లాడుతూ..మాధవరెడ్డికి చెందిన భూమిని దుర్మార్గంగా ఆక్రమించుకొనేందుకు సుమారు గత సంవత్సర కాలం నుంచి త్రిపుర ల్యాండ్ మార్కు సంస్థ ప్రయత్నిస్తుందన్నారు. రైతు భూమిని వారికి విక్రయించేందుకు ససేమిరా అనడంతో ఆక్రమ మార్గంలో లాక్కునేందుకు గాను గతంలో కొంతమందిని ఉసిగొలిపి రెండుసార్లు కొట్టించారని, ఈ విషయమై నాలుగు సార్లు ఎఫ్ ఐ ఆర్ లు కూడా నమోదయ్యాయని, కోర్టు కూడా వారికి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చిందని వాటిని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యానికి దిగుతుండడంతో ఏమీ తోచక ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు మాధవరెడ్డి అన్నాడని వారు తెలిపారు. కబ్జాదారుల వల్ల ఓ రైతు చనిపోవడం దారుణమైన చర్య అని, బాధ్యులైన వారిని పోలీసులు వెంటనే కఠినంగా శిక్షించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్, ఆశోక్ రెడ్డి, యాదయ్య, ఆంజనేయులు, ప్రభాకర్ పాల్గొన్నారు.