తనయుడు ఇళ్లు వదిలి వెళ్లాడని తండ్రి లోకం విడిచి అనంత లోకాలకు…

• భౌరంపేటలో చోటు చేసుకున్న విషాదం
• తమ భూమి లాక్కునేందుకు భూబకాసురుల యత్నం
• మనస్థాపానికి గురై ఇళ్లు వదిలి ఆదృశ్యమైన రైతు
• దుండిగల్ సీఐకు లేఖ రాసి మరీ…
• త్రిపుర ల్యాండ్ మార్కు సంస్థ, ఓ కార్పొరేటర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని…
• లేఖలో పేర్కొని ఆదృశ్యమైన రైతు మాధవరెడ్డి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 10 :  మానవ సంబంధాలు బలహీన పడుతున్న నేటి సమాజంలో తనయుడు ఇళ్లు వదిలి వెళ్లిపోయాడని మనో వేదనకు గురైన తండ్రి తనవు చాలించి లోకం విడిచి అనంతలోకాలకు చేరుకున్న విషాద సంఘటన కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ మున్సిపల్ పరిధి భౌరంపేట్ లో బుధవారం చోటు చేసుకుంది. తనయుడు తాను ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నానని లేఖ రాసి మంగళవారం ఆదృశ్యమవ్వడంతో బుధవారం ఆతని తండ్రి ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. బుధవారం ఉదయం వరకు బాగానే ఉన్నాడని, కొడుకుపై బెంగతోనే మరణించాడని గ్రామస్తులు అంటున్నారు.

తనయుడి ఆదృశ్యం ఆందుకే…
భౌరంపేట గ్రామానికి చెందిన వంపుగూడెం మాధవరెడ్డి అనే రైతుకు దొమ్మర పోచంపల్లిలోని సర్వే నెంబర్ 183, 188లో వంశపారంపర్యంగా వచ్చిన 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సదరు భూమిని ఆనుకొని త్రిపుర ల్యాండ్ మార్కు నిర్మాణ సంస్థకు చెందిన స్థలం ఉంది. మాధవరెడ్డికి చెందిన 1.13 ఎకరాల భూమిని తమకు విక్రయించాలని త్రిపుర సంస్థ వారు ఆడగగా, రైతు నిరాకరించడంతో కక్ష కట్టి ఆ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు విశ్వ ప్రయత్నాలు గతంలో జరిగాయాయని, ప్రస్తుతం జరుగుతున్నాయని వినికిడి. ఈ భూ వ్యవహారంతో విసిగి వేసారిన రైతు మాధవరెడ్డి దుండిగల్ పోలీసు స్టేషన్ సీఐకు మంగళవారం ఓ లేఖ రాసిపెట్టి కనిపించకుండా పోయాడు.

లేఖలో ఏముంది…
తన వ్యవసాయ భూమిని కొందరు భూబకాసులు దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తూ తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నారని, నా కుటుంబం జాగ్రత్త, ఆమ్మ, నాన్న, పిల్లలు నన్ను క్షమించండి. నేను ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న అంటూ తన ఆవేదనను లేఖలో దుండిగల్ సీఐకు తెలియపరిచి కనిపించకుండా పోయాడు. త్రిపుర ల్యాండ్ మార్కు నిర్మాణ సంస్థ యజమాని పసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం, మరి కొందరు బీఆర్ఎస్ నాయకులు వారి పలుకుబడిని ఉపయోగించి తమ భూమి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, దానితో తాను విసిగిపోయానని, పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నాడు. ఇప్పటికైనా లేఖలో పేర్కొన్న సదరు బాధ్యులపై వెంటనే చట్టరిత్యా చర్యలు తీసుకొని తన భూమిని, కుటుంబాన్ని రక్షించాలని కోరాడు.

ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు…
రైతు మాధవరెడ్డి రాసిన లేఖను ఇంట్లో గుర్తించిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల, పరిసర ప్రాంతాలతో పాటు బంధువులు, తెలిసినవారు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఫలితం లేకపోయింది. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు మాధవరెడ్డి రాసిన లేఖతో దుండిగల్ పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో తనయుడు ఆదృశ్యమైన విషయాన్ని తట్టుకోలేని మాధవరెడ్డి తండ్రి బుధవారం మనో వేదనతో చనిపోయాడని తెలుస్తుంది. భూవివాదంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం, భూబకాసురుల దౌర్జన్యమే ఇంతటి విషాదానికి దారి తీసిందని భౌరంపేట రైతులు
మండిపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More