• ఆరెస్టు చేసి రిమాండుకు తరలించిన జీడిమెట్ల పోలీసులు
• బీఆర్ఎస్ నాయకురాలు పద్మజారెడ్డి ఆలియాస్ పద్మక్క ప్రధాన సూత్రధారి
• బతికున్న వారిని మరణించినట్లుగా చూపి మరీ కబ్జాలు..
• నగరంతో పాటు పక్క రాష్ట్రంలోని స్థలాలపై కన్ను
• విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్
గాజులరామారం (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 4 : తీగ లాగితే డొంక కదిలిందనే చందంగా… ఓ వ్యక్తి తన ప్లాట్ ను నకిలీ భూపత్రాలతో కబ్జా చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు చేసిన ఫిర్యాదుతో నకిలీ పత్రాలు సృష్టించే ఓ పెద్ద ముఠా బయట పడింది. దీంతో నకిలీ భూపత్రాలను సృష్టించి తమవి కానీ భూములను అప్పనంగా స్వాధీనం చేసుకుంటున్న ఆరుగురు సభ్యుల ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్ లోని ప్లాట్ నెంబర్ 147లో ఉన్న తన 200 గజాల స్థలాన్ని నకిలీ భూపత్రాలతో కబ్జా చేశారని బాధితుడు ఎల్. సురేష్ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయేలా నకిలీలల బాగోతం బయటపడింది. కేవలం ఫిర్యాదు అందిన సుభాష్ నగర్లోని ఆ ఒక్క ప్లాటే కాకుండా నగరంతో పాటు పక్క రాష్ట్రంలోని స్థలాలకు కూడా సదరు ముఠా ఎసరు పెట్టిన నకిలీ పత్రాలు పోలీసులకు చిక్కాయి.
• ‘పద్మ’ వ్యూహమే…
సుభాష్ నగర్ లోని సురేష్ స్థలాన్ని కాజేసేందుకు పద్మజా రెడ్డి అలియాస్ కుత్బుల్లాపూర్ పద్మక్క (32) అనే బీఆర్ఎస్ నాయకురాలు హయత్ నగర్ కు చెందిన రేపాటి కరుణాకర్ (34) అనే వ్యక్తిని (గతంలో దారి దోపిడిల నిందితుడు) సంప్రదించి అతనికి రూ. 3.50 లక్షలు ఇచ్చి నకిలీ భూపత్రాలు సృష్టించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో స్థల యజమాని సురేష్ 1992లో చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాన్ని సృష్టించారు. ఆధార్ కేంద్రంలో పని చేసే ఆపరేటర్ నరేంద్ర (25) సహాయంతో నకిలీ భూపత్రాలు సృష్టించి ముఠాలోని రవి శంకర్ (38), హరీష్ (36)లను భూ విక్రయదారులుగా సంబంధిత పత్రాల నకిలీలు తయారు చేశారు. వాటి ఆధారంగా కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అప్పటి సబ్ రిజిస్టర్ సహకారంతో 2023 ఫిబ్రవరి 22వ తేదీన కుత్బుల్లాపూర్ పద్మక్క తన చెల్లెలు నాగిరెడ్డి కోమల కుమారి (49) పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. సదరు రిజిస్ట్రేషన్ పత్రాలతో అసలు భూ యజమాని సురేష్ ను బెదిందించి, భయపెట్టి వెళ్లగొట్టారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఆసలు గుట్టు రటైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందుతులను రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి
ఆధార్ కార్డు నవీకరించే యంత్రం, నకిలీ ఆధార్ కార్డులు, భూపత్రాలు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ముఠా హయత్నగర్ లో 274 గజాలు, జూబ్లీహిల్స్ లోని 1000 గజాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ లో మరో స్థలాన్ని కాజేసేందుకు పన్నాగం పన్నినట్లు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ సురేష్ తెలిపారు. ఈ సమావేశంలో బాలానగర్ ఏసీపీ హన్మంతరావు, జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.