నిర్మాణ భవనం పైనుంచి పడి మేస్త్రి మృతి
• 5వ అంతస్తులో పనిచేస్తున్న మేస్త్రి
• పరంజి కర్ర విరిగి కాలుజారి కింద పడి మృతి
• ఎటువంటి రక్షణ లేకుండా పై అంతస్తుల్లో పనులతోనే ప్రమాదం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 7: నిర్మాణంలో ఉన్న భవనంలో 5వ అంతస్తులో పనిచేస్తూ అక్కడి నుంచి జారిపడి మేస్త్రి మృతి చెందిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాగట్ జిల్లా కట్టంగీ గ్రామానికి చెందిన పతిరాం మేష్రామ్ కుమారుడు కమలేష్ మేష్రామ్ (45) గత మూడు నెలల కిందట నిర్మాణ పనుల కోసం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మా నగర్ ఫేజ్ 1కు వలస వచ్చి అక్కడే బతుకు తెరువు కోసం మేస్త్రి పని చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం యధావిధిగా అపార్ట్మెంట్ 5వ అంతస్తు బయట పరంజి పై పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పరంజి కర్ర విరిగి కాలు చేరడంతో అక్కడ నుంచి సరాసరి కింద పడిపోయారు. 108 కు అపార్ట్మెంట్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న బాలనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ నిర్మిస్తున్న యజమాని కానీ గుత్తేదారు కానీ కార్మికుల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రమాదకరంగా పనులు నిర్వహిస్తుండడంతోనే సంఘటన చేస్తుందని స్థానికులు, తోటి కార్మికులు అంటున్నారు