ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి పై చర్యలు తీసుకోవాలి
~ మల్కాజ్ గిరి ఆర్డీవోకు ఫిర్యాదు అందజేసిన బిజెపి నాయకులు
~ సూరారం సిఎంఆర్ పాఠశాలలో ప్రభుత్వ స్థలం
~ కబ్జా స్థలాన్ని క్రీడామైదానం, పాఠశాల బస్సుల పార్కింగ్ కు వినియోగిస్తున్న వైనం
~ ప్రభుత్వ సూచిక బోర్డులను తొలగించి మరి ఎకరం స్థలం ఆక్రమణ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 15 : ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని క్రీడా మైదానం, పాఠశాల బస్సుల పార్కింగ్ కోసం వాడుకుంటున్న సిఎంఆర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు మల్కాజ్ గిరి ఆర్డీవో శ్యాం ప్రకాష్ ను కలిసి ఫిర్యాదు అందజేశారు. సూరారం గ్రామం లోని ప్రభుత్వ స్థలం సర్వేనెంబర్ 166, 167లో సుమారు ఒక ఎకరాకు పైగా స్థలాన్ని కబ్జా చేసి ఎమ్మెల్యే మల్లారెడ్డి కి చెందిన సీఎంఆర్ పాఠశాల అనధికారంగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి సదరు స్థలాన్ని పాఠశాల క్రీడా మైదానం, పాఠశాలకు చెందిన బస్సుల పార్కింగ్ లను చేస్తున్నారు. గతంలో ఇదే విషయంపై కుత్బుల్లాపూర్ తాసిల్దార్, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే పాఠశాలకు నోటీసులు జారీ చేసిన వాటిని ఖాతరు చేయకపోగా, సదరు స్థలంలో ఉన్న ప్రభుత్వ సూచిక బోర్డులను సైతం తొలగించి దర్జాగా కబ్జాలో ఉన్నారని తెలిపారు.
ఇంత జరుగుతున్నా కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు పాల్పడిన ఎమ్మెల్యే మల్లారెడ్డి అతని విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదరు ప్రభుత్వ స్థలాన్ని ప్రజల అవసరాల కోసం వినియోగించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.